జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి దేవీమానస
ఖమ్మంమయూరిసెంటర్: విద్యార్థులు స్నేహభావంతో ఉండాలే తప్ప ర్యాగింగ్‌కు పాల్ప డితే చట్టరీత్యా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా న్యాయసేవాసంస్థ కార్యదర్శి పి.దేవీమానస తెలిపారు. ఖమ్మంలోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ఎస్‌ఆర్‌జేసీ బాలికల కళాశాలలో ర్యాగింగ్‌తో అనర్థాలపై మంగళవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థినులకు వేధింపులు ఎదురైతే అధ్యాపకులు లేదా యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యాసంస్థల్లో సురక్షితమైన, స్నేహపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పేలా ప్రతీ విద్యార్థి బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. అనంతరం విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. యువతులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని, తద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్టీసీ విలీన హామీ
అమలుచేయాలి
మధిర: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు కోరారు. మధిరలో మంగళవారం జరిగిన సమావేశంలో యూనియన్ మధిర డిపో కమిటీని ప్రకటించారు. అనంతరం వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక సమ్మె సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలను చెల్లించాలని కోరారు. నాయకులు శీలం నరసింహారావు, పడకంటి మురళి, మందా సైదులు, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు లింగమూర్తి, పద్మావతి, సుధాకర్, నర్సిరెడ్డి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్యం మెరుగుపడాలి
తల్లాడ: పారిశుద్ధ్య నిర్వహణ మెరుగైతేనే సీజనల్ వ్యాధులను కట్టడి చేయొచ్చని జిల్లా మలేరియా అధికారి కొత్తగుండ్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తల్లాడ మండలం కుర్నవల్లిలో ఇటీవల ఓ వ్యక్తి డెంగీ సోకి మృతి చెందగా, గ్రామంలో డీఎంఓ మంగళవారం తనిఖీ చేశారు. ఈమేరకు ఇళ్లతో పాటు పరిసరాల పరిశుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు. అలాగే, మురికి నీరు నిల్వ ఉండకుండా, దోమలు వృద్ధి చెందే ఆవాసాలను శుభ్రం చేయించాల్సిన ఆవశ్యకతపై సిబ్బందికి సూచనలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ డాక్టర్ శిరీష, పైలేరియా కన్సల్టెంట్ లక్ష్మణ్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
మున్సిపాలిటీల్లో
ఆన్‌లైన్ సేవలకు బ్రేక్
ఖమ్మంరూరల్: వెబ్‌సైట్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా ఏదులాపురం మున్సిపాలిటీలో పలు సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొత్త ఇళ్లకు నంబర్ల కేటాయింపు, ఆస్తి యాజమాన్య మార్పిడి(మ్యూటేషన్), పేరు సవరణ వంటి సేవలు ప్రస్తుతం అందుబాటులో లేవని పేర్కొన్నారు. అయితే, ఈ సమస్య ఏదులాపురం మున్సిపాలిటీలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నట్లు తెలిసిందని వెల్లడించారు. సమస్య పరిష్కారానికి సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని, అప్పటివరకు అంతరాయం కొనసాగుతుందని తెలిపారు.


