ఖమ్మంఅర్బన్: జిల్లాను పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో లకారం పార్క్ సమీపాన రూ.40 కోట్లతో ‘హరిత భవన్’నిర్మాణానికి నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సచివాలయంలో పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుమారు ఐదెకరాల్లో నిర్మించే భవన నమూనాలు సిద్ధం కాగా పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. తొలుత ప్రతిపాదించిన ‘హరిత హోటల్’అని కాకుండా పేరు ‘హరిత భవన్’గా మార్చాలని సూచించారు. ఇప్పటికే ఐదెకరాల భూమిని జిల్లా యంత్రాంగం కేటాయించినందున, త్వరగా నిర్మాణం పూర్తి చేస్తే జిల్లాకు వచ్చే పర్యాటకులు, ఇతర వర్గాల వారికి నాణ్యమైన వసతి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అంతేకాక ప్రాజెక్టుకు అవసరమైన రూ.40 కోట్ల నిధులు త్వరగా మంజూరు చేయాలని కోరుతూ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేఖ రాసినట్లు వెల్లడించారు. సమావేశంలో పర్యాటశాఖ ఎస్‌ఈ సరిత, డీఈ రామకృష్ణ, ఏఈ నరేశ్, కన్సల్టెంట్ బాలకృష్ణ పాల్గొన్నారు.
లకారం పార్క్ సమీపాన నిర్మాణం


