● ఏడాదిలోగా ఖమ్మం డెయిరీ ఆధునికీకరణ ● రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య జీఎం మధుసూదన్‌రావు
ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వ డెయిరీ(విజయ)ల ఆస్తుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య జనరల్ మేనేజర్ మధుసూదన్ రావు తెలిపారు. ఖమ్మం రోటరీనగర్‌లోని విజయ డెయిరీని రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా యూనిట్, పరిశ్రమ స్థలాన్ని పరిశీలించాక కలెక్టర్ దివాకర టీ.ఎస్.ను కలిసి ఖమ్మం యూనిట్ ఆధునికీకరణ ప్రతిపాదనలు సమర్పించారు. ఇందుకు అవసరమైన నిధుల మంజూరుకు సహకరించాలని కోరారు. కేంద్రం నుంచి నిధుల కోసం ఎంపీలను కలిశామని తెలిపారు. అనంతరం జీఎం మధుసూదన్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ డెయిరీల బలోపేతానికి చర్యలు చేపట్టామని తెలిపారు. పాల సేకరణ కేంద్రాల నిర్వహణకు సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా, పాడి రైతులకు బీమా సౌకర్యం కల్పించడంతో గేదెల కొనుగోలుకు రుణాలు అందించే కృషి జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డెయిరీ ప్రత్యేకాధికారి మల్లికార్జున్‌రావు, ఖమ్మం డిప్యూటీ డైరెక్టర్ కె.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆవరణలో బంక్, ఆధునికీకరణ
రాష్ట్రంలో రహదారుల వెంట ఉన్న ప్రభుత్వ డెయిరీ(విజయ) స్థలాల్లో పెట్రోల బంక్‌ల ఏర్పాటు చేయనున్నట్లు జీఎం మధుసూదన్‌రావు తెలిపారు. ఈ జాబితాలో జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లితో పాటు అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, ఆదిలాబాద్, నిర్మల్, లక్సెట్టిపేట, షాద్‌నగర్, వరంగల్ ఉన్నాయని చెప్పారు. ఇక్కడ బంక్‌ల ఏర్పాటుతో పాడి యూని ట్లకు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ఇక పాల నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా ఖమ్మంతో పాటు వరంగల్, నిజామాబాద్ ప్రభుత్వ డెయిరీ యూని ట్లను రూ.100 కోట్లతో సమూలంగా ఆధునికీకరించనున్నామని తెలిపారు. అధునాతన యంత్రాలు ఏర్పాటుచేసి ఏడాదిలోగా పనులు పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని జీఎం వివరించారు.


