కూసుమంచి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) మరింత వేగంగా జరిగేలా ఓటర్లు సహకరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కూసుమంచి మండల కేంద్రంలో మంగళవారం పర్యటించిన ఆయన ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, ఆన్‌లైన్‌ను పరిశీలించి బీఎల్‌ఓల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ఎంత కీలకమో సేకరణ కూడా ముఖ్యమేనని తెలిపారు. వివరాలు నింపడంలో ఓటర్లకు అవగాహన కల్పిస్తే త్వరగా అందుతాయని చెప్పారు. అయితే, డేటా ఎంట్రీకి సమయం ఎక్కువగా పడుతోందని సిబ్బంది చెప్పగా.. అదనపు సిబ్బందిని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ నెల 24లోగా ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయాల్సి ఉన్నందున ఓటర్లు త్వరగా అందించి సహకరించాలని కోరారు. తొలుత ప్రక్రియ విజయవంతానికి ప్రజాప్రతినిధులు, వలంటీర్లు సహకరించాలని కోరారు. అనంతరం గంగబండతండా వద్ద కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్ విద్యా పురోగతి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. కాగా, పాఠశాలలో నీటి కొరత ఉందని విద్యార్థులు చెప్పగా వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణం, ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవన నిర్మాణాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ జశ్వంత్‌కుమార్, ఎంఈఓ రాయల వీరస్వామితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


