నరసింహస్వామికి లక్ష తులసీ అర్చన
ఖమ్మంగాంధీచౌక్: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం నగరంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం లక్ష తులసీ దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. తొలుత స్వామివారిని పూలతో అలంకరించారు. ఆ తరువాత సంప్రదాయ పద్ధతుల్లో తులసీ దళాలతో అర్చన చేశారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్ రావు పర్యవేక్షణలో అర్చకులు పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
డ్రైవర్లకు
ఉచిత వైద్య పరీక్షలు
ఖమ్మంక్రైం: రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో వాహనాల డ్రైవర్లకు ఆదివారం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలు సైతం చేసి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్యులు గౌతమ్‌నరేష్, మాదిరాజు అశోక్, ఏఎంవీఐలు స్వర్ణలత, సుమలత, ఆర్టీఓ సభ్యుడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
10 నుంచి టీసీసీ పరీక్షలు
ఖమ్మం సహకారనగర్ : టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(టీసీసీ)–2026కు సంబంధించిన పరీక్షలు ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ చైతన్య జైనీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షల హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in లో అందుబాటులో ఉన్నాయనా పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే తమ కార్యాలయంలోని జిల్లా ప్రభుత్వ పరీక్షల కమిషనర్ (ఏసీజిఈ)ను సంప్రదించాలని సూచించారు.
ప్రశాంతంగా టెట్
టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) రెండో రోజైన ఆదివారం ప్రశాంతంగా జరిగిందని డీఈఓ చైతన్య జైనీ తెలిపారు. 9 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు మొదటి సెషన్‌లో 1,786 మందికి 1,077 మంది, రెండో సెషన్‌లో 2,020 మందికి గాను 1,615 మంది అభ్యర్థులు హాజరయ్యారని ఆమె వివరించారు.
కిన్నెరసానిలో
పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు జిల్లాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 388 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.26,685 ఆదాయం లభించింది. 200మంది బోటు షికారు చేయగా, టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.12,020 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
నరసింహస్వామికి లక్ష తులసీ అర్చన


