కేయూ క్రికెట్ విజేత ‘వరంగల్’
కేయూ క్రికెట్ విజేత ‘వరంగల్’
రెండో స్థానంలో ఖమ్మం జట్టు
ఖమ్మంస్పోర్ట్స్: నగరంలోని ఎస్‌ఆర్‌అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం నిర్వహించగా.. వరంగల్ జోన్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌లో వరంగల్ – ఖమ్మం జోన్ జట్లు తలపడగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. జట్టులో ఉదయ్ 32, శిశిరిక్ 16 పరుగులు చేశారు. వరంగల్ బౌలర్లలో నితిన్, దివిన్, ఇబ్రహీం, సిద్ధార్థ ఒక్కో వికెట్ పడగొట్టగా ప్రద్యుమ్న నాలుగు వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన వరంగల్ జోన్ జట్టు తొమ్మిది ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించింది. బ్యాట్స్ మెన్ దివిన్ 77 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. తర్వాత బ్యాట్స్‌మెన్‌లలో నితిన్ 28 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. రవికుమార్, డాక్టర్ బి. వెంకన్న హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో పీఈడీలు డాక్టర్ పి.కోటేశ్వరరావు, జె.ఉపేందర్, కుమార్, అస్లాం, సందీప్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.


