రైతుల సంక్షేమానికే రిజిస్ట్రేషన్
● పథకాల లబ్ధి కోసం ఆధార్, భూ వివరాలు నమోదు ● జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య
ఖమ్మంవ్యవసాయం: రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభ్వుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టిందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రాధాన్యతను వెల్లడించిన ఆయన వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ద్వారా అందుబాటులోకి రాగా రైతుల ఆధార్ నంబర్, భూమి వివరాలు పొందుపరుస్తారని తెలిపారు. ఇందులో రిజిస్ట్రేషన్ కావడం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్, పంటల బీమా అమలులో ఆటంకాలు ఎదురుకావని చెప్పారు. జిల్లాలో 3,54,320మంది రైతులకు గాను ఇప్పటి వరకు 1,97,459 మందిని ఫార్మర్ రిజిస్ట్రీలో ఏఈఓలు నమోదు చేశారని, మిగతా వారు కూడా ముందుకు రావాలని డీఏఓ సూచించారు.
ఇవీ ప్రయోజనాలు..
ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలు నమోదు చేయించుకోవడం ద్వారా కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల అమలు సులభమవుతుందని డీఏఓ తెలిపారు. పీఎం కిసాన్ అమలుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరని, రైతుల వివరాలు కచ్చితంగా నమోదు చేయడంతో పారదర్శకత పెరిగి బీమా, సబ్సిడీలు, రుణాలు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. ఈ మేరకు రైతులు ఆధార్ కార్డు, భూమి పాస్ బుక్‌తో పాటు ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ వివరాలతో ఏఈఓల వద్ద ఉచితంగా నమోదు చేయించుకోవచ్చని తెలిపారు. అంతేకాక మీ సేవ కేంద్రాల్లో రూ.15 చెల్లించి నమోదు చేసుకునే అవకాశం కూడా ఉందని డీఏఓ పుల్లయ్య వివరించారు.


