18న ఖమ్మంలో చారిత్రక సభ
● కార్పొరేట్ల కోసమే ‘ఉపాధి’ పేరు మార్పు ● సీపీఐ జాతీయ నేత నారాయణ
ఖమ్మంమయూరిసెంటర్ : ఈనెల 18న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలో చారిత్రక సభ నిర్వహించనున్నట్లు పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్షలాది మందితో జరిగే ఈ సభకు దేశ, విదేశీ ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. మతోన్మాద శక్తులను అడ్డుకునే సత్తా కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని, కమ్యూనిస్టులను అంతం చేయడం, సిద్ధాంతాన్ని కనుమరుగు చేయడం ఎవరి తరమూ కాదని అన్నారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే భూ పంపిణీ జరిగిందని, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. అలాంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. సంపద కోసమే అమెరికా వెనిజులాపై దాడి చేసిందని, ప్రజాస్వామిక ప్రభుత్వాలపై ట్రంప్ దాడి చేయడాన్ని ప్రజలంతా ఖండించాలని కోరారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు అవాస్తవమని, వెనిజులాలోని చమురు సంపదను వశం చేసుకునేందుకే ట్రంప్ ఆ దేశాధ్యక్షుడిని బంధించాడని అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల లబ్ధి కోసమే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం మార్పు చేసిందని విమర్శించారు. 40 కుటుంబాల కోసం రూ.28 లక్షల కోట్ల రాయితీ ప్రకటించిన కేంద్రం.. 85 కోట్ల మందికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకాడుతోందని ఆరోపించారు. మూసీ ప్రక్షాళనలో ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని కోరారు. శాసనసభను బైకాట్ చేసిన బీఆర్‌ఎస్ సభ్యులు వెంటనే రాజీనామా చేయాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వేతనాలు ఎలా పొందుతారని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ తగదని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించాలని కోరారు. పోలవరం, బనకచర్ల సాధ్యం కాదని, చంద్రబాబు, రేవంత్ రెడ్డిల గురుశిష్యుల కథ ముగిసిందని అన్నారు. సమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర సమితి సభ్యులు యర్రా బాబు, ఏపూరి లతాదేవి, సిద్దినేని కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.


