ఇంతింతై.. రూ.40లక్షలై! | - | Sakshi
Sakshi News home page

ఇంతింతై.. రూ.40లక్షలై!

Nov 26 2023 1:00 AM | Updated on Nov 26 2023 12:01 PM

- - Sakshi

భద్రాచలం అర్బన్‌: శాసనసభ ఎన్నికల సమరంలో డబ్బు కీలకపాత్ర పాత్ర పోషిస్తుందన్నది ఎవరూ కాదనలేని అంశం! అయితే, ఎన్నికల నియమావళి ప్రకారం బరిలో నిలిచిన అభ్యర్థులు ఇష్టారీతిన డబ్బు ఖర్చు పెట్టడానికి వీలులేదు. ప్రస్తుత నిబంధనలు అనుసరించి వ్యయపరిమితి గరిష్టంగా రూ. 40 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఈ వ్యయ పరిమితి తొలినాళ్లలో రూ.లక్ష మాత్రమే ఉండగా ఇంతింతై వటుడింతై అన్నట్లు ఇప్పుడు రూ.40క్షలకు చేరింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల నుంచి చూస్తే నలభై రెట్లు పెరిగినట్లయింది.

నామినేషన్‌ రోజు నుంచే లెక్క
2014 అసెంబ్లీ ఎన్నికల సమయాన అభ్యర్థుల వ్యయ పరిమితి రూ.28 లక్షలుగా ఉండేది. ఇక లోక్‌సభ ఎన్నికల వ్యయ పరిమితిని రూ.95 లక్షలుగా నిర్ణయించారు. నామినేషన్‌ వేసిన రోజు నుంచి పోలింగ్‌ జరిగే వరకు అభ్యర్థి చేసే ప్రతీ ఖర్చును ఎన్నికల వ్యయంగానే పరిగణిస్తారు. అయితే, పార్టీ తరఫున జరిగే సభల ఖర్చును అభ్యర్థి ఖాతాలోకి తీసుకోరు. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు చేసే ఖర్చులన్నీ ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలి. అందుకోసం నామినేషన్‌ దాఖలు చేసే నాటికి కొత్త అకౌంట్‌ ప్రారంభించాలి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు లేదా ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు ఎలాంటి ఖర్చు చేయరాదని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. తనిఖీల్లో పట్టుబడిన నగదు, ఇతర సామగ్రి ఎవరైనా అభ్యర్థిదని తేలితే ఆ అభ్యర్థుల వ్యయంలో చేరుస్తారు. రోజువారీగా అభ్యర్థులు చేసే వ్యయంతో పాటు పార్టీ జెండాలు, బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లు, టోపీలు, కండువాలు, భోజనాలు, వాహనాల అద్దె, ఇంధన ఖర్చులు, సభా వేదికలు, మైకులు, పత్రికలు, టీవీ, సోషల్‌ మీడియా ప్రకటనలకు చేసే ఖర్చులను కలిపి అభ్యర్థి ఎన్నికల వ్యయంగా లెక్కిస్తారు. వీటిలో ప్రతీదానికి బిల్లు సమర్పించాలి. అంతేకాక ఎన్నికల సంఘం నిర్దేశించిన ధరల ఆధారంగా లెక్కలు పరిగణనలోకి తీసుకుంటారు.

పెరుగుతున్న వ్యయపరిమితి
1952 సాధారణ ఎన్నికల సమయాన అభ్యర్థుల వ్యయపరిమితి రూ.లక్షగా ఉండేది. ఇది 1962 నాటికి రూ.3లక్షలకు, 1971 ఎన్నికల్లోరూ.4లక్షలకు, 1975 నాటికి రూ.5 లక్షలు చేరింది. 1984లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా రూ.10 లక్షలకు చేరగా... 1991 నాటికి రూ.12లక్షలకు పెంచారు. ఆతర్వాత 1999లో రూ.15 లక్షలు, 2004 నాటికి రూ.17 లక్షలు, 2009లో రూ.26 లక్షలు, 2014లో రూ.28 లక్షల వ్యయపరిమితిని నిర్ణయించారు. ఇది ప్రస్తుత ఎన్నికల్లో రూ.40 లక్షలకు చేరుకుంది. కాగా, ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చును రూ.40లక్షలుగా నిర్దేశించిన అంతకు మించి ఎన్నో రెట్లు ఖర్చవుతోందని ప్రస్తుత ప్రచారం తీరును చూస్తే అర్థమవుతోందని పలువురు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement