● ఆస్పత్రిలో సోదరునికి పరామర్శ
సాక్షి, బెంగళూరు: ప్రముఖ నటుడు రజనీకాంత్ గురువారం బెంగళూరుకు వచ్చారు. రాజరాజేశ్వరినగరలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్‌ను పరామర్శించారు. గైక్వాడ్ నాలుగు రోజుల క్రితం ఇంట్లో మెట్ల మీద నుంచి అదుపుతప్పి పడిపోయారు. ఆయన తలభాగానికి దెబ్బ తగిలి రక్తస్రావం అయింది. దీంతో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు తలకు శస్త్ర చికిత్స చేశారు. ఆయన కోమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా కళ్లు తెరవలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ రజనీకాంత్ వచ్చి వైద్యులతో వివరాలు తెలుసుకున్నారు. తరువాత కనకపుర రోడ్డులోని రవిశంకర్ గురు ఆశ్రమానికి వెళ్లి కొంతసేపు గడిపారు.
శ్రీకంఠేశ్వరునికి
రూ.1.24 కోట్ల ఆదాయం
మైసూరు: దక్షిణ కాశీగా పేరొందిన జిల్లాలోని నంజనగూడులో వెలసిన శ్రీకంఠేశ్వర (నంజుండేశ్వర) దేవస్థానానికి నెలవారీ హుండీ లలో రూ.1.24 కోట్ల కానుకలు లభించాయి. హుండీల లెక్కింపు చేపట్టగా, రూ.1 కోటి 24 లక్షల 38 వేల నగదు లభించింది. 25 గ్రాముల బంగారు, 800 గ్రాముల వెండి సొత్తు లభ్యమయ్యాయి. ఆరు దేశాలకు చెందిన 14 కరెన్సీ నోట్లు వచ్చాయి. ఈఓ సీజీ కృష్ణ నేతృత్వంలో బసవేగౌడ, సభ్యులు, బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్యోగులకు డీఏ పెంపు
సాక్షి, బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండుగ శుభ సందర్భాన సర్కార్ తీయని వార్త చెప్పింది. కరువుభత్యాన్ని (డీఏ) 2.25 శాతానికి పెంచింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి ఈ జూలై 1 నుంచి ఈ పెంపు డీఏ వర్తించనుంది. దీంతో మొత్తం డీఏ 15.75 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది.
మహిళ నుంచి
రూ.17 లక్షల నగల లూటీ
● ఖతర్నాక్ అరెస్టు
దొడ్డబళ్లాపురం: తక్కువ ధరలో విమాన టికెట్ ఇప్పిస్తానని మహిళ నుంచి రూ.17 లక్షల విలువైన బంగారు నగలు దోచిక ఖతర్నాక్ ఉదంతమిది. వివరాలు.. అస్సాంకు చెందిన చనువర్ అలీ (36) బెంగళూరు బట్టరహళ్లిలో ఉంటున్నాడు. రాజస్థాన్‌కు చెందిన పుష్ప (40) అనే మహిళ అక్టోబర్ 14న సింగపూర్ నుంచి బెంగళూరుకు వచ్చింది. రాజస్థాన్‌కు వెళ్లడానికి యశవంతపుర రైల్వేస్టేషన్‌లో రైలు కోసం వేచి ఉండగా అక్కడకు వచ్చి పరిచయం చేసుకున్న నిందితుడు తక్కువ ధరకు విమానం టికెట్ ఇప్పిస్తానని కారులో తీసుకెళ్లాడు. బాగలూరు వద్ద ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు జాగ్రత్తగా బ్యాగులో ఉంచుకోవాలని మాటల్లో పెట్టి నగల బ్యాగుతో పరారయ్యాడు. బాధితురాలు బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాల చిత్రాల ద్వారా గుర్తించి అతన్ని పట్టుకున్నారు. 117 గ్రాము బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.
ధన్వీర్ ఫోన్ రీసెట్..
డేటా మాయం
● పోలీసుల విచారణలో వెల్లడి
● జైలు ఆడియోలు, వీడియోల కేసు..
బొమ్మనహళ్లి: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీలను రాజ కుమారుల్లా చూసుకుంటున్నారని ఫోన్‌లో మాట్లాడిన ఆడియో వైరల్ అయిన కేసులో నటుడు ధన్వీర్ గౌడపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ధన్వీర్‌పై ఇదివరకే నటుడు దర్శన్ భార్య పలు ఫిర్యాదులు చేయడం తెలిసిందే.
ఫోరెన్సిక్ నివేదిక
పోలీసులు ధన్వీర్ జైలు ఆడియో, వీడియోలున్న మొబైల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా, సాక్ష్యాల నాశనానికి ప్రయత్నించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆ ఫోన్‌ను పూర్తిగా ఫ్యాక్టరీ రీసెట్ చేసినట్లు, దీనివల్ల జైలులోని వైరల్ వీడియోలు, వాట్సాప్ చాట్‌లు, ఇతర అంశాలు డిలిట్ అయినట్లు తెలిపారు. ఒక న్యాయవాది తనకు జైలు వీడియోలను తనకు పంపినట్లు ధన్వీర్ విచారణలో పేర్కొన్నాడు. ధన్వీర్‌కు మరోసారి నోటీసు జారీ చేసి, విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏమిటీ కేసు?
పరప్పన చెరసాలలో కొందరు ఖైదీలు దర్జాగా మొబైల్ ఫోన్లు వాడుతూ, చిందులు వేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో జైళ్ల లోపల ఏం జరుగుతోందని ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియోలను ధన్వీరే వైరల్ చేశాడని పోలీసులు విచారణ చేపట్టారు.


