బొమ్మనహళ్లి: దీపావళి పండుగ సందర్భంగా ఇంట్లో నేతి మిఠాయిలు చేసుకోవాలనుకుంటే మోత మోగడం ఖాయం. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) మరోసారి నందిని బ్రాండు పాల ఉత్పత్తుల ధరలను భారీగా పెంచేసింది. ఆర్టీసీ బస్సు చార్జీల మాదిరిగానే బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. వారం కిందటే పాలు, పెరుగు రేట్లపై రూ.10కి పైగా బాదడం తెలిసిందే. ప్రజలు దాని గురించే ఆలోచిస్తూ ఉండగా వెన్న, నెయ్యి, చీజ్, పన్నీర్ వంటి ధరలనూ అధికం చేయడం గమనార్హం. నగరవాసులు, కాస్త ఆదాయం ఉన్న ఉపయోగించే వీటి ధరల ఆకస్మాత్తుగా సవరించింది. నందిని ఒక లీటరు నెయ్యి ప్యాకెట్ ధర రూ.715 ఉంటే, పెంచాక రూ.850 చేరింది. రూ.135 అధికమైంది.
భారీగా ధరలు పెంచిన సర్కారు పండుగ ముందు పెనుభారం
ఎలాంటి ప్రభావం ఉంటుంది?
దీపావళి సమయంలో ఇంట్లో మిఠాయిలు చేసుకుంటారు, లేదా షాపుల్లో చేసే మిఠాయిలను కొనుగోలు చేస్తుంటారు. వీటి తయారీలో నెయ్యి, వెన్నను అధికంగా ఉపయోగిస్తారు. ధరల పెంపు వల్ల మిఠాయిల రేట్ల ఎగబాగే అవకాశముంది.
నెయ్యి తయారీకి వెన్న అవసరం. అదే వెన్నను బేకరీల వంటకాల తయారీలో అధికంగా వాడతారు. దీంతో బేకరీ తినుబండారాలు సైతం ధరలు పెరుగుతాయనే ఆందోళన ఉంది.
అలాగే హోటళ్లలో నెయ్యి, వెన్న వాడి చేసే దోసె, ఇడ్లీ, ఇతర వంటకాల రేట్లను పెంచినా ఆశ్చర్యం లేదు.
వంట గ్యాస్, పాలు, పెరుగు, ఇతర నిత్యావసరాల ధరలు పెరిగాయంటూ బెంగళూరు హోటళ్లవారు తరచూ రేట్లను బాదడం వల్ల ప్రజలు హోటళ్లకు వెళ్లాలంటే భయపడుతున్నారు.
ఇది చూసి ప్రైవేటు సంస్థలు కూడా నెయ్యి, వెన్న రేట్లను పెంచే ప్రమాదం లేకపోలేదు.
ఉత్పత్తుల పెంపు వివరాలు..
1 లీటరు నెయ్యి ప్యాకెట్ ధర రూ. 715 నుంచి
రూ. 850 కి పెంచారు
1 లీటరు పెట్ జార్ నెయ్యి రూ.735 నుంచి రూ.870 కి
ఉప్పు వెన్న 500 గ్రాములు రూ.310 నుంచి 380 కి
ఉప్పు లేని వెన్న 500 గ్రాములు రూ. 330 నుంచి 390 కి
పన్నీర్ 1 కేజీ రూ.408 నుంచి రూ. 485 పెంపు


