సాక్షి బెంగళూరు: సర్ ప్రక్రియను రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం డీకే శివకుమార్‌తో సహా ఇండి కూటమి నాయకులు బెంగళూరులో ఆందోళన చేశారు. ఓటును రక్షించండి–దేశాన్ని కాపాడండి పేరిట గురువారం ఫ్రీడం పార్కులో జరిగింది. కాంగ్రెస్, వామపక్షాలు సహా భాగస్వామ్య పార్టీల నాయకులు, వేలాది కార్యకర్తలు తరలివచ్చారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమారి వేషధారిని లాకప్‌లో పెట్టినట్లు సెట్టింగ్ వేశారు.
ఓటు చోరీపై దర్యాప్తు: సీఎం డీకే
సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ ఓటు చోరీకి కుట్ర పన్నిన, అలాగే ఫారం–7ను దుర్వినియోగం చేసినవారిపై పోలీసు విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఈసీ మీద మాత్రమే కాదు, దీని వెనుక ఉన్న బీజేపీ కుట్రపై కూడా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మన హక్కు అని, అలాంటి హక్కును కాపాడుకునేందుకు ఇక్కడికి చేరినట్లు తెలిపారు. బెంగళూరులో ఒక సంస్థ ద్వారా బీజేపీ.. లక్షలాది ఓట్లను తొలగించిందని, కొత్త ఓటర్ల చేరికలో కూడా అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. బీజేపీ కార్యాలయం నుంచే ఫారం–7 ముద్రించి ఓటర్ల పేర్లు, గుర్తింపు కార్డు, ఫోన్ నంబర్‌తో నియోజకవర్గ నాయకులకు పంపించారని తెలిపారు.
సర్‌ను రద్దు చేయాలి: సిద్దు
మాజీ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ సర్ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధం, దీనిని తక్షణమే రద్దు చేయాలని, అలాగే జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ కుమార్ ఎంపికను తమ నేత రాహుల్‌గాంధీ మొదట్లోనే వ్యతిరేకించారని చెప్పారు. కర్ణాటకలో సర్‌కు ముందు 5.54 కోట్ల ఓటర్లు ఉంటే ఆ తర్వాత 4.55 కోట్ల ఓటర్లే మిగిలారని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో ఓటర్లు తగ్గిపోవడం చిన్న విషయం కాదన్నారు.
బెంగళూరు స్వతంత్రపార్కులో
ఇండి కూటమి ఆందోళన
పోలీసు విచారణ జరిపిస్తాం: సీఎం డీకే
అమిత్ షా అబద్ధాలు: ప్రకాశ్‌రాజ్
బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. దేశంలో మూడు కోట్ల మంది చొరబాటుదారులు ఉన్నట్లు హైదరాబాద్‌లో మాట్లాడుతున్నారని, ఆయనకు కొద్దిగా అయినా సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. దేశంలో ఇన్ని సమస్యలు ఉంటే చొరబాటుదారుల గురించి మాట్లాడతారని ఎద్దేవా చేశారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాతో పాటు సర్‌ను రద్దు చేయాలన్నారు. ఆదివాసీలు, దళితులు, ముస్లింల ఓట్లను సర్ ద్వారా తొలగించారని ఆరోపించారు. కర్ణాటకలో సర్‌ను వ్యతిరేకించకపోతే మరో పశ్చిమ బెంగాల్ అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. కాగా, మైసూరు, కలబుర్గిలోనూ సర్ వ్యతిరేక నిరసనలు నిర్వహించారు.


