దొడ్డబళ్లాపురం: షేర్ల ట్రేడింగ్ పేరుతో ఒక వ్యక్తి నుంచి రూ.93 లక్షలు కాజేసిన ముగ్గురు కేటుగాళ్లను బెంగళూరు సైబర్ కమాండ్ పోలీసులు అరెస్టు చేశారు. జార్ఖండ్‌కు చెందిన అమిత్ మిశ్రా, బెంగళూరువాసులు తౌసిఫ్, పరశురాంకు సంకెళ్లు పడ్డాయి. ముగ్గురూ కలిసి హరీష్ అనే వ్యక్తిని షేర్ల వ్యాపారం పేరుతో నమ్మించి రూ.93 లక్షలను తమ ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. ఇందుకు మోసపూరిత ఏపీకే ఫైల్స్‌ను ఉపయోగించారు. ఆ డబ్బులను అమాయకుల ద్వారా తెరిచిన నకిలీ ఖాతాల్లో నిల్వ చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి గుట్టురట్టు చేశారు. నిందితుల నుంచి 6 మొబైళ్లు స్వాధీనం చేసుకోగా వాటిలో 507 మ్యూల్ అకౌంట్ల వివరాలున్నాయి. టెలిగ్రామ్, వాట్సాప్‌లలో గ్రూపులు ఏర్పాటు చేసి వాటి ద్వారా జనం నుంచి సేవా కార్యక్రమాల కోసమంటూ వివరాలు తీసుకుని మ్యూల్ ఖాతాలను తెరిచేవారు.


