రాయచూరు రూరల్: హిందూ ధర్మ రక్షణలో మఠాల కృషి అభినందనీయమని మాజీ మంత్రి శివన గౌడ నాయక్, గ్రామీణ మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్ కొనియాడారు. ఆదివారం కిల్లే బృహన్మఠంలో కోళంకి జీవైక్య గురుపాదేశ్వర జయంతి పర్వం, గురుపాదేశ్వర సద్శావన పాదయాత్ర నిర్వహించారు. కోళంకి జీవైక్య గురుపాదేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మఠం నుంచి ప్రారంభమైన సద్భావన పాదయాత్ర 8 కి.మీ. దూరంలోని కోళంకి వరకూ కొనసాగింది. పూర్వ కాలంలో కోళంకి జీవైక్య గురుపాదేశ్వర కరువు సమయంలో ప్రజల బాధలు తీర్చడానికి ఏడు రోజులు కొండలో తపస్సు చేసి వర్షాలు కురిపించారని కిల్లే బృహన్మఠాధిపతి శాంత మల్లశివాచార్యులు గుర్తు చేశారు. రోబోట్ ఏనుగు పాదయాత్రలో చేగుంట మఠాధీశులు క్షీరలింగ స్వామి, తండికేరి మఠాధీశుడు గంగాధర స్వామీజీ, సోమనాథ శివాచార్య, శంభు సోమనాథస్వామి, మాజీ మంత్రి బోసురాజ్, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, వసంత్ కుమార్, మాజీ నగర సభ సభ్యుడు దరూరు బసవరాజ్, వినయ్ కుమార్, శివ శంకర్, రేణుక, కేశవ మూర్తి, కేశవ రెడ్డి, పంపాపతి శాస్త్రి పాల్గొన్నారు.


