రక్తదానం.. మహాదానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానం.. మహాదానం

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

రాయచూరు రూరల్‌: ఆపద సమయంలో తోటి మానవుడి ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని భారతీయ వైద్య సంఘం మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ రవి రాజేశ్వర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం రాయచూరు నగరంలోని భారతీయ వైద్య సంఘ భవనంలో మాజీ నగరసభ ఉపాధ్యక్షుడు జయన్న జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇటీవల కాలంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం లభించక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విపత్కర సమయంలో రక్తం అందించడం ప్రాణదానంతో సమానమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో జాన్‌వెస్లి, శోభ, మ్యాదర్‌, సుధీర్‌, హఫీజుల్లా, రాజ్‌ కుమార్‌, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, మల్లిక, సత్యనారాయణ, నరసింహులు, భీమేష్‌ పాల్గొన్నారు.

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

నలుగురికి గాయాలు

రాయచూరు రూరల్‌: సిరవార తాలుకా కల్లూర్‌ వద్ద ఆదివారం విద్యుత్‌ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. రాయచూరు నుంచి మాన్వి వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం దెబ్బతింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సిరవార పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

పరామర్శ

రాయచూరు రూరల్‌: నగరంలోని జహీరాబాద్‌ వద్ద ట్రాక్టర్‌లో వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్‌ టైర్ల కిందపడి సుచిత్‌ కుమార్‌ (16), చరణ్‌ కుమార్‌ (14) మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం జిల్లా అధికారి పూవిత జహీరాబాద్‌కు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాలుర మృతిపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సర్కార్‌ నుంచి ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు హంపణ్ణ, జుబీన్‌ మోహ పాత్రో, తహసీల్దార్‌ సురేష్‌ వర్మ, అదనపు ఎస్పీ హరీష్‌ పాల్గొన్నారు.

కనీస వేతనాల కోసం నిరసన

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలోని వివిధ శాఖలు, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనాలు అందజేసి, సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘం డిమాండ్‌ చేసింది. ఆదివారం దేవదుర్గ తపాల కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు నరహరి మాట్లాడారు. రాష్ట్ర సర్కార్‌ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్‌ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. కనీస వేతనాలు అందించాలని కోరుతున్నా ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించి, సౌలభ్యాలు సక్రమంగా అందేలా చూడాలని కోరుతూ రాష్ట్రపతికి పోస్టుకార్డులు పంపారు.

రైతుల సంక్షేమమే సర్కార్‌ లక్ష్యం

రాయచూరు రూరల్‌: రైతుల సంక్షేమమే సర్కార్‌ ప్రధాన లక్ష్యమని గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ దద్దల్‌ తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో 15 మంది ఎస్టీలు, 12 మంది ఎస్సీ రైతులకు పంపు సెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గంగ కళ్యాణ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా స్వావలంబన సాధించాలని పేర్కొన్నారు. నీటిని పొదుపుగా వాడుకుని, భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement