రాయచూరు రూరల్: వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని మాజీ మంత్రి బోసురాజ్ పిలుపునిచ్చారు. ఆదివారం గంజ్ కళ్యాణ మంటపంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. రాయచూరు జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఎంపికై న కె.శాంతప్ప బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోసురాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర సర్కార్ కరువు సహాయక పనులు చేపట్టడం లేదని ఆరోిపణలు చేయడం తగదన్నారు. డిసెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కార్యకర్తల సహకారంతో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. కార్యకర్తలు అందరూ సంఘటితం కావాలని తెలిపారు. భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడు శాంతప్పకు మాజీ అధ్యక్షుడు బసవరాజ్ బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో అసమ్మతి నాయకులను కలుపుకుని పార్టీని మరింత బలంగా తయారు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యులు హంపయ్య నాయక్, హంపన గౌడ బాదర్లి, బసన గౌడ బాదర్లి, బసన గౌడ దద్దల్, వసంత కుమార్, మాజీ శాసన సభ్యులు హులిగేరి, శరణప్ప మట్టూరు, రామణ్ణ, సుఖాణి, రుద్రప్ప, అమరే గౌడ, జయన్న, నిర్మ, శ్రీదేవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.


