బాగేపల్లి: దాంపత్య జీవితానికి స్వస్తి పలకాలని రెండేళ్ల క్రితమే విడాకులు దాఖలు చేసిన దంపతులు లోక్ అదాలత్‌లో మళ్లీ ఒకటయ్యారు. పట్టణంలో జేఎంఎఫ్‌సీ సీనియర్ జడ్జి భారతీదేవీ సమక్షంలో జరిగిన లోక్ అదాలత్‌లో చలపతి, అలివేలమ్మ దంపతులు పాల్గొన్నారు. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల నుంచి గొడవలుపడుతూ వేర్వేరుగా ఉంటున్నారు. రెండేళ్ల క్రితమే విడాకులకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. లోక్ అదాలత్‌లో జడ్జి, న్యాయవాదులు వారికి కలిసి జీవించాలని నచ్చజెప్పారు. పూలదండలు తెప్పించి మార్పించి ఆశీర్వదించారు.


