మైసూరు: అమాయకంగా కనిపిస్తే చాలు ఇట్టే దోచేస్తున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల భారీ మోసాలు సంభవించాయి. ఇంటి నిర్మాణానికి పునాదులు తీస్తుండగా 5 కేజీల బంగారు నిధి లభించిందని, మీరు రూ.90 లక్షలు ఇస్తే 2 కేజీల బంగారాన్ని ఇస్తామని నమ్మించిన దుండగుడొకరు తన ముఠాతో వచ్చి ఇంజనీర్ నుంచి రూ.52 లక్షలను తీసుకుని పరారైన ఘటన జరిగింది. వివరాలు.. మైసూరు తాలూకా మెల్లహళ్లి గ్రామ నివాసి, ప్రస్తుతం హైదరాబాద్‌లో క్యాడెన్స్ కంపెనీలో లీడ్ డిజైన్ ఇంజనీర్‌గా పని చేస్తున్న కామిని ప్రవీణ్ వంచనకు గురైన వ్యక్తి. రమేష్ అనే వ్యక్తి ఫోన్ చేసి గతంలో మీ ఇంటి వద్ద పనిచేస్తుండగా 5 కేజీల బంగారం దొరికిందని, తాను గదగ్‌లో ఉన్నానని చెప్పాడు. దీంతో ఆశ పడిన ప్రవీణ్ గదగ్‌కు వెళ్లి రమేష్‌ను కలిశాడు. మొదట అసలైన బంగారం ముక్కను చూపించి నమ్మించాడు. తర్వాత 2 కేజీల బంగారం కావాలని చెప్పగా, రూ.90 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారం మైసూరు–బన్నూరు ప్రధాన రహదారిలో ఏటీఎంఈ కాలేజీ వద్ద 2 కేజీల నకిలీ బంగారం ముక్కలు ఇచ్చాడు. ఇంతలో నాలుగు బైకుల్లో వచ్చిన 8 మంది దుండగులు కారులో ఉన్న ప్రవీణ్, అతని తండ్రిపై దాడి చేసి రూ.52 లక్షల నగదు బ్యాగ్‌ను కూడా లాక్కొని పరారయ్యారు. బాధితులు వరుణ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
హ్యాక్ చేసి రూ.1.97 కోట్లు లూటీ
మైసూరు: రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (ఆర్‌ఏటీ) అనే సైబర్ దాడి ద్వారా ఓ ఇంజనీరు బ్యాంకు ఖాతాను హ్యాక్‌చేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ. 1.97 కోట్లను దోచుకున్నారు. మైసూరు ఉదయగిరి నివాసి, ఇంజనీర్ అయిన వ్యక్తి బాధితుడు. అతని 8 బ్యాంకు ఖాతాలు, 3 క్రెడిట్ కార్డు ఖాతాలపై ఆర్‌ఏటీ ద్వారా దుండగులు సైబర్ దాడి చేశారు. అతని మొబైల్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుని తద్వారా ఓటీపీలు పొందుతూ రూ.1,97,44,215 తమ ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. చివరకు తెలుసుకుని సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
పూజల పేరుతో
రూ.42 లక్షల బంగారం మాయం
దొడ్డబళ్లాపురం: బంగారు నగలతో పూజ చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్మించిన జ్యోతిష్యుడు అమాయక మహిళ నుంచి రూ.40 లక్షల విలువైన నగలు తీసుకుని మోసం చేసిన సంఘటన బెంగళూరులోని బ్యాటరాయనపురలో జరిగింది. బ్యాటరాయనపుర నివాసి శాంతమ్మ(62) బాధితురాలు. వెంకటేశ్ అనే జ్యోతిష్యుడు శాంతమ్మకు కొన్ని విషయాల్లో చెప్పినవి నిజమవడంతో ఆమె అతడిని చాలా నమ్మింది. కుమారుడు మద్యం మాని బాగుపడాలంటే ఏం చేయాలని వెంకటేశ్‌ను అడగగా చౌడేశ్వరి దేవి విగ్రహానికి ఇంట్లో ఉన్న నగలు అన్నీ వేసి అమావాస్య రోజుల్లో ప్రత్యేక పూజలు చేయాలని చెప్పాడు. సరేనంటూ ఆమె రూ.40 లక్షల విలువైన బంగారు నగలు ఇచ్చి పూజలు చేయలని చెప్పింది. ఆమెకు మాయమాటలు చెప్పి నగలతో పరారయ్యాడు. తరువాత కొడుకు, కోడలు తెలుసుకుని బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మైసూరు వద్ద కేటుగాళ్ల మోసం


