రాయచూరు రూరల్: గత రెండు రోజుల నుంచి యాదగిరి జిల్లా ఇటగా గ్రామంలో ప్రవహించే భీమా నదిలో వేలాది చేపలు మృత్యువాత పడడంతో ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం నదీ తీరంలో నీరు నీలం రంగుతో ప్రవహించాయని, దాని ప్రభావంతో చేపలు మరణించడానికి కారణమై ఉంటుందని అరోపిస్తున్నారు. ఈ విషయంపై కర్ణాటక రక్షణ వేదిక సంచాలకుడు యల్లప్ప జేవర్గి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించి నది నీటిని మనుషులు, పశువులు తాగకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరినట్లు తెలిపారు.
యువత ఆర్థిక స్వతంత్రత సాధించాలి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో పోటీ ప్రపంచానికి దీటుగా ఎదుర్కోవాలంటే యువత స్వావలంబన దిశగా అడుగులు వేయాలని ఎమ్మెల్సీ బసనగౌడ బాదర్లి పేర్కొన్నారు. సింధనూరులో ఏర్పాటు చేసిన స్వావలంబి సారధి పథకం కింద యువకులకు కార్లు, ద్విచక్ర వాహనాలను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. నిరుద్యోగ సమస్య నుంచి బయట పడేసేందుకు జారీ చేసిన స్వావలంబి సారధి పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రూ.75 వేల వేతనం.. విధులకు డుమ్మా
● ఎమ్మెల్యే ఉమేష్ మేటి కోడలు డిస్మిస్
హుబ్లీ: బాగలకోటె వాంబే కాలనీలోని నమ్మ క్లినిక్‌లో వైద్యాధికారిగా సేవలు అందిస్తూనే నియమాలకు వ్యతిరేకంగా పీజీ డాక్టర్‌గా విద్యాభ్యాసం చేస్తున్న వైద్యాధికారిణి డాక్టర్ అంకిత యరగల్‌ను కాంట్రాక్ట్ సేవల నుంచి తక్షణమే అమలయ్యేలా తొలగిస్తూ ఆ జిల్లా డీహెచ్‌ఓ డాక్టర్ రాజ్‌కుమార్ యరగల్ ఆదేశాలను వెల్లడించారు. ప్రస్తుతం డీహెచ్‌ఓ డాక్టర్ రాజ్‌కుమార్ యరగల్ కుమార్తె, ఎమ్మెల్యే ఉమేష్ మేటి కోడలైన డాక్టర్ అంకితను నమ్మ క్లినిక్‌లో వైద్యాధికారిణిగా నియమించారు. అయితే ఆమె నమ్మ క్లినిక్‌లో విధులు నిర్వహించకుండా పీజీ అధ్యయనానికి వెళ్లేది. హాజరు పుస్తకంలో సంతకం చేసి రూ.75 వేల ప్రభుత్వ వేతనం తీసుకుంటున్న ఆరోపణలపై విమర్శలు చెలరేగడంతో ఎట్టకేలకు ఆమైపె వేటు పడింది.
కాలువకు నీటి కోసం ఆందోళన
హుబ్లీ: భద్రా డ్యాం నుంచి కుడిగట్టు కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, రైతు సంఘాలు కలిసి దావణగెరె శివారులోని బాడ క్రాస్ వద్ద రాస్తారోకో చేపట్టారు. మాజీ మంత్రి ఎంపీ రేణుకాచార్య సారథ్యంలో రైతులు జాతీయ రహదారి–48పై ఎగువ భద్రాకు 3 టీఎంసీల నీరు వదిలి భద్రా ఆయకట్టు ప్రాంత రైతులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. వర్షాలు లేక వరి, ఉద్యానవన తదితర పంటలు ఎండిపోయాయి. చెరువుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని రైతులు ఆక్రోశం వ్యక్తం చేశారు. భద్రా కుడిగట్టు కాలువకు తక్షణమే నీటిని వదలాలని రైతులు డిమాండ్ చేశారు.
హక్కులను కాపాడుకోవాలి
కోలారు: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అంతర్జాతీయ ప్రజా ప్రభుత్వ వినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. గ్రామాంతర బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ రాజ్యాంగం దేశంలోని అందరికి సమాన హక్కులను కల్పించిందన్నారు. మానవహక్కులను రక్షించడం, భారత రాజ్యాంగాన్ని బలపర్చడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అన్నారు. కోలారు నగరాభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు మహమ్మద్ హనీఫ్, సయ్యద్ అన్వర్, శ్రీకృష్ణ, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.


