రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలోని యాదగిరి జిల్లా గురుమటకల్‌ను కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించి, వాణిజ్య బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని గురుమటకల్ శాసన సభ్యుడు శరణేగౌడ కందకూరు డిమాండ్ చేశారు. సోమవారం బెంగళూరు విధానసౌధ ముందు మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఆయన ఆందోళన చేపట్టి మాట్లాడారు. జిల్లా అధికార యంత్రాగం కరువు తాలూకాగా ప్రకటించాలని రాష్ట్ర సర్కారుకు ప్రతిపాదనలు పంపినా జేడీఎస్ శాసన సభ్యుడిననే భావనతో కరువు ప్రాంతంగా ప్రకటించకుండా జాబితా నుంచి తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విధాన పరిషత్ ప్రతిపక్ష నేత నారాయణస్వామి ఎమ్మెల్యేకు మద్దతు తెలిపారు.
కనీస వేతనాలు అందించరూ
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని వివిధ శాఖలు, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలకు తోడు సవరించిన వేతనాలను అందించాలని కాంట్రాక్ట్ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడారు. రాష్ట్ర సర్కార్ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అందించేలా సర్కార్ చర్యలు చేపట్టి వారికి సక్రమంగా సౌకర్యాలు అందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.


