రాయచూరు రూరల్: నగరంలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి యతీంద్ర సిద్దరామయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరసభ, కార్పొరేషన్లు, ఈ–ఖాతా, తాగునీరు, మురుగు కాలువల శుభ్రత, అమృత నగర్– 2 పథకం పనులు మందకొడిగా సాగడంపై మంత్రి అధికారులపై చిందులు తొక్కారు. నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి చేయాలన్నారు.
డిసెంబరులోగా ‘స్థానిక’ ఎన్నికలు
నగర స్వచ్ఛతను కాపాడడానికి అధికారులు ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి యతీంద్ర సిద్దరామయ్య పేర్కొన్నారు. సోమవారం నగరంలోని యక్లాసపుర వద్ద చెత్త సేకరణ డంప్ యార్డులను పరిశీలించి మాట్లాడారు. ముఖ్యమంత్రి డీకే.శివ కుమార్ పేర్కొన్నట్లు డిసెంబర్‌లోగా జెడ్పీ, టీపీ, జీపీ, నగరసభ, కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. ఐదేళ్లుగా జెడ్పీ, టీపీ, జీపీలకు, ఎనిమిదేళ్లుగా నగరసభలకు ఎన్నికలు నిర్వహించలేదన్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికల ప్రక్రియలు జరుగుతాయన్నారు. మహాత్మాగాంధీ వికాస్ పథకంలో నగరానికి రూ.185 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. స్వచ్ఛ భారత్ పథకం కింద రాయచూరు సిటీ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకొని శుభ్రత, ముడి వస్తువుల సేకరణ, ఇతర పనుల నిర్వహణలో తర్ఫీదు పొందే అవకాశముందన్నారు. ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఏనుగు ప్రతిమలను చూసి అధికారులను అభినందించారు. రెవెన్యూ అదాలత్‌ను ప్రారంభించి, అమృత్ తాగునీటి పథకాన్ని పర్యవేక్షించారు. మావినకెరె చెరువును పరిశీలించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీలు బోసురాజు, వసంత్ కుమార్, ఎమ్మెల్యే బసన గౌడ, ఆర్డీఏ అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లాధికారిణి పూవిత, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, మల్లికార్జునలున్నారు.


