సాగునీరు విడుదల చేయాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

సాగునీరు విడుదల చేయాలని ఆందోళన

Sep 7 2026 3:08 AM | Updated on Sep 7 2026 3:08 AM

రాయచూరు రూరల్‌: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టు చివరి భూములకు సాగునీరు విడుదల చేయాలని మాజీ మంత్రి వెంకట్రావ్‌ నాడగౌడ డిమాండ్‌ చేశారు. ఆదివారం సింధనూర్‌ తాలుకా జవుళి గేట్‌ (జవుళీదిన్ని క్రాస్‌) వద్ద రైతులు మూడు గంటల పాటు భారీ రాస్తారోకో నిర్వహించారు. వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెంకట్రావ్‌ నాడగౌడ మాట్లాడుతూ.. నీటి లభ్యతను సరిగ్గా అంచనా వేయడానికి నిరంతరం గేజ్‌ నిర్వహణ చేపట్టాలని తెలిపారు. 54వ ఉప కాలువ కింది భాగంలో ఉన్న రైతులకు నీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 69 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు వదలాలంటే కాలువలోకి 389 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాలువ పైభాగంలో కొందరు అక్రమంగా అమర్చిన పైపుల ద్వారా నీటిని మళ్లించుకుంటున్నారని.. వాటిని తక్షణమే తొలగించాలన్నారు. కొప్పళ ఇన్‌చార్జ్‌ మంత్రి శివరాజ్‌ తంగడిగి వెంటనే రాజీనామా చేయాలన్నారు.

రహదారులకు

మరమ్మతులు చేయరా?

రాయచూరు రూరల్‌: యదగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రహదారులపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలని కరవే డిమాండ్‌ చేసింది. ఆదివారం వడిగెర క్రాస్‌ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా కరవే జిల్లా అధ్యక్షుడు భీమా పూజారి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల నిధులు వచ్చినప్పటికీ రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చడంలో అధికారులు, శాసన సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా, తాలూకా స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో రోడ్లను పరిశీలించి మరమ్మతులు చేయాలని కోరారు.

లోకాయుక్తకు ఫిర్యాదు

హుబ్లీ: నియమాలను ఉల్లంఘించి ప్రభుత్వ వాహనాన్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రజాధనాన్ని వ్యర్థం చేశారని నవళగుంద ఎమ్మెల్యే ఎన్‌.హెచ్‌.కోనరెడ్డిపై లోకాయుక్తతో పాటు మానవ హక్కుల కమిషన్‌కు సామాజిక కార్యకర్త మాబుసాబ్‌ యరగుప్పి ఫిర్యాదు చేశారు. గత నెల 6న మంత్రి సంతోష్‌లాడ్‌తో ఎమ్మెల్యే కోనరెడ్డి నవళగుంద తాలూకాలో కరువు పరిస్థితులను పరిశీలించారు. ఆ సమయంలో కోనరెడ్డి ఎస్కార్ట్‌ వాహనం వాడుకున్నారని సామాజిక కార్యకర్త మాబుసాబ్‌ యరగుప్పి వీడియోలతో పాటు హోం శాఖకు ఫిర్యాదు చేశారు. అయితే హోం శాఖ ఆయన ఎస్కార్ట్‌ వాహనాన్ని వెనక్కి తీసుకుంది. అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్యే వాడిన ఎస్కార్ట్‌ వాహన డీజల్‌ బిల్లు, సిబ్బంది వేతనాలతో పాటు వాహన మరమ్మతులను ప్రభుత్వమే వసూలు చేయాలి. ఇది ప్రజాధనం ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనం అని మాబుసాబ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మద్యపానంతో అనర్థాలు

బళ్లారి అర్బన్‌: మద్యపానంతో పాటు అన్ని రకాల దుర అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన, వ్యసన రహిత జీవనం సాగించాలని కళ్యాణ మహాస్వామి సూచించారు. ఆదివారం నగరంలోని బండిహట్టి కార్యక్షేత్రం కళ్యాణ స్వామి మఠంలో శ్రీ క్షేత్ర ధర్మస్థల గ్రామాభివృద్ధి యోజన ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసనాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యకరమైన కుటుంబం ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. మద్యపానం వ్యక్తి ఆరోగ్యంపైనే కాకుండా కుటుంబం ప్రశాంతత, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. మద్యానికి బానిస కావడం వల్ల కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు తలెత్తుతాయన్నారు. సంతోషకరమైన జీవనం సాగించాలని సూచించారు. కార్యక్రమంలో కళ్యాణ మఠం కన్నేరి మఠం సవితానంద మహాస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంతానం లేదని

కార్మికుడు ఆత్మహత్య

హోసూరు: సంతానం కలగపోవడంతో విరక్తి చెందిన కార్మికుడు ప్రాణాలు తీసుకున్న ఘటన బాగలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల మేరకు తిరుపత్తూరు జిల్లా పెరంపట్టు గ్రామానికి చెందిన శంకర్‌ (37), ఇతని భార్య సత్య (25), ఈ దంపతులకు గత ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. హోసూరు తాలూకా జీ.మంగలం సమీపంలోని ఓ కోళ్లఫాంలో పనిచేస్తున్నారు. పిల్లలు పుట్టలేదని బాధపడేవారు. విరక్తి చెందిన శంకర్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. బాగలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement