అభివాదం చేస్తున్న బీజేపీ నాయకులు పాదయాత్రకు పూర్ణకుంభాలతో స్వాగతం పలుకుతున్న మహిళలు
సాక్షి, బళ్లారి: తమ పాదయాత్ర ప్రభావంతోనే సీఎం డీకే శివకుమార్ ఉత్తర కర్ణాటక వైపు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర పేర్కొన్నారు. ఆదివారం ఆరవ రోజు పాదయాత్ర ఉల్లాసంగా కొనసాగింది. కొప్పళ జిల్లా గంగావతి తాలూకా మీదుగా కంప్లి వరకు కొనసాగిన పాదయాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది. గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీ అరుణ, జేడీఎస్ పార్టీ నేత బసవరాజ్ హొరట్టి, మాజీ మంత్రి శ్రీరాములు, స్థానిక బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో జనం పాల్గొనడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. పాలాలు మధ్య రైతులను పలకరిస్తూ పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. పొలాలు మధ్య గొర్రెలు కాపరులు, యజమానులను ఆప్యాయంగా పలకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విజయేంద్ర విలేకరులతో మాట్లాడారు. బీజేపీ పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి సర్కార్‌కు వణుకు పుడుతోందని తెలిపారు. ప్రజా సేవకుడు అని చెప్పుకునే సీఎం డీకేశీ మాటలు చూస్తుంటే నవ్వు వస్తుందని ఎద్దేవా చేశారు. సూటు, బూటు వేసుకుని హెలికాప్టర్లలో తిరిగితే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ప్రజా సేవకుడు ఎలా అవుతారని మండపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సీఎం డీకేశీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ధ్వజం
ఉత్సాహంగా కొనసాగుతున్న పాదయాత్ర


