సాక్షి,బళ్లారి: ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు విద్య, ఉద్యోగ రంగాల్లో 7 శాతం అదనపు రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపట్టామని, అందుకు తగిన మార్గదర్శకాలు, దిశానిర్దేశాలను త్వరలోనే జారీ చేస్తామని సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఆయన శనివారం ఉమ్మడి బళ్లారి జిల్లా కూడ్లిగిలోని గుడేకోట రోడ్డులో ఇంటి ముంగిటకే ప్రభుత్వ పాలన అనే విధంగా ఏర్పాటు చేసిన ప్రజా సేవ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన విద్యనందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించనుండటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకు సమాజంలో అదే గౌరవం లభిస్తుందన్నారు.
రాధాకృష్ణన్ ప్రస్థానం స్ఫూర్తిదాయకం
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత రాష్ట్రపతి పదవి దాకా ఎదిగారన్నారు. ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు. డాక్టర్ల తరహాలో టీచర్లను కూడా టీఆర్ అని సంబోధించేలా దిశానిర్దేశం చేస్తామన్నారు. డాక్టర్లకు ముందు డీఆర్ అని ఎలా రాస్తారో టీచర్లకు కూడా టీఆర్ అని రాసి గౌరవం కల్పిస్తామన్నారు. ప్రజలే పాలకులు, అధికారం ఇచ్చిన ప్రజలు దేవుళ్లతో సమానం అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నేను ప్రజా సేవకుడిని– సీఎం
హొసపేటె: రాజుల యుగం ముగిసింది. ప్రజాస్వామ్యం వచ్చింది. నేను ప్రజాసేవకుడిని అని ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఉద్ఘాటించారు. శనివారం విజయనగర జిల్లా కూడ్లిగిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త ప్రజాసేవ శాఖను ప్రారంభించి ఆయన మాట్లాడారు. పనుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు చుట్టూ తిరిగే రోజులు పోయాయి. ప్రభుత్వ పరిపాలన నేరుగా ప్రజల గడపకే చేరాలనే పవిత్ర ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం అని ఆయన వివరించారు. విధాన సౌధ, కలెక్టరేట్ లేదా తహసీల్దార్ కార్యాలయాల నుంచి పరిపాలన సాగిస్తూ అధికారులు ప్రజలకు దూరంగా ఉండటం సరికాదు. ప్రజాసేవా విభాగం ప్రజల సమస్యలను ఆలకించి, అక్కడికక్కడే ప్రత్యక్ష పరిష్కారాలను అందించడానికి కృషి చేస్తుందని అన్నారు.
ప్రజల ముంగిటకే అధికారులు
సామాన్యుడు ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా తాలూకా అధికారుల కోసం వెతుక్కుంటూ రాకుండా అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను విని పరిష్కరించాలి. ఈ ఉద్దేశ్యంతోనే ప్రజా సేవా విభాగాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వ్యవస్థను రాష్ట్రంలోని మొత్తం 224 నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నామన్నారు. ప్రతి నెలా మొదటి, మూడో శనివారాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజల వద్దకు వెళ్లి పని చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించామన్నారు.
కార్యక్రమంలో ఓ మహిళ నుంచి అర్జీని స్వీకరిస్తున్న సీఎం డీకే.శివకుమార్
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీఎం డీకే.శివకుమార్, చిత్రంలో ఎంపీ, ఎమ్మెల్యేలు
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యనందించడమే లక్ష్యం
టీచర్లను ఇకపై డాక్టర్ల తరహాలో టీఆర్ అని సంబోధిస్తాం
కూడ్లిగి ప్రజా సేవ కార్యక్రమంలో సీఎం డీకే శివకుమార్


