సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో సీఎం డీకే శివకుమార్ దిశానిర్దేశంతో నూతనంగా ప్రారంభించిన ప్రజా సేవ ఉద్యమం ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే వేదిక కానుందని ఎమ్మెల్యేలు నాగేంద్ర, నారా భరత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం వారు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేసిన ప్రజాసేవ కార్యక్రమాన్ని నగరంలో ప్రారంభించి మాట్లాడారు. జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామాల్లో పేరుకుపోయిన, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటి ముంగిటికే వచ్చి సమస్యలను నేరుగా ఆలకించి అక్కడికక్కడే పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసేందుకు, జనం కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగకుండా నేరుగా జనం వద్దకే పాలన అన్న విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
ఏ పనికై నా సత్వర పరిష్కారం
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులకు ముగింపు పలకాలని, ఏ పనినైనా సాధ్యమైంత త్వరలో పరిష్కరిస్తారన్నారు. చట్ట పరిధిలో ఉన్న పనులన్నింటికీ సాధ్యమైంత వరకు పరిష్కారం చూపిస్తారన్నారు. ఇది సీఎం కలల ప్రాజెక్టు అని గుర్తు చేశారు. అధికారులు కూడా బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో అర్హుల పేర్లు కచ్చితంగా ఉండాలన్నారు. నగరంలో మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాసేవ కార్యక్రమంలో జనం ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించి, అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నగర ప్రజలు పాల్గొన్నారు.
దేశానికే ఆదర్శంగా నిలవనుంది
ఎమ్మెల్యేలు నాగేంద్ర, నారా భరత్‌రెడ్డి


