హుబ్లీ: జైలులోని అవ్యవస్థను ఖండిస్తూ ఖైదీలు ఆందోళన చేపట్టారు. ఆందోళనపై జైలు అధికారులు స్పందించక పోవడంతో ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ధార్వాడ జిల్లా కేంద్ర కారాగృహంలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని మీరజ్‌కు చెందిన మహేష్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. అస్వస్థతతో ఉన్న ఆయనను జిల్లా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. జైలులో కనీస సౌకర్యాలు లేక ఖైదీలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ అవ్యవస్థను సరి చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజుల నుంచి ఆందోళన చేపట్టారు. ఖైదీల ఈ ఆందోళనను జైలు అధికారులు పట్టించుకోలేదు. హత్య కేసులో నిందితుడిగా గత ఏడాదిన్నరగా జైలులో ఉన్న మహేష్ ఈ అకృత్యానికి పాల్పడ్డారు. ధార్వాడ ఉప నగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకా పోలీసు స్టేషన్‌లో ఖాకీల బాధ్యతారాహిత్యానికి అమాయక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. యాతనూరు గ్రామ నివాసి రేవుబాయి అనే మహిళపై పాతకక్షల నేపథ్యంలో ఆ గ్రామానికి చెందిన కొందరు అమానుషంగా దాడి చేశారు. అతనికి జరిగిన అన్యాయానికి న్యాయం కల్పించాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కన్నీరు పెడుతూ ఈ మహిళ నెలోగి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా ఆమెను రక్షించడానికి బదులుగా వేధించారు. దాడికి గురై తీవ్రంగా గాయపడినా కూడా ఎఫ్‌ఐఆర్ దాఖలుకు పోలీసులు కాలయాపన చేశారని ఆమె ఆరోపించింది. దీంతో ఆమె దిక్కుతోచని స్థితిలో ఆ స్టేషన్ పరిధిలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆమె కలబుర్గిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై రేవుబాయి కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు.


