రాయచూరు రూరల్: రాష్ట్రంలో కరువు ఛాయలు తీవ్రంగా నెలకొన్నాయనే నెపంతో కాంగ్రెస్ సర్కార్ పేదలకు, మహిళలకు జారీ చేసిన పంచ గ్యారెంటీ పథకాలకు మంగళం పాడిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర ఆరోపించారు. శనివారం ఐదో రోజు బీజేపీ నేతలు లింగసూగూరు నుంచి బళ్లారికి చేస్తున్న పాదయాత్రలో భాగంగా కారటగి మీదుగా గంగావతికి పాదయాత్రగా వెళ్లే ముందు విలేకరులతో మాట్లాడారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో అమలు పరిచిన గ్యారంటీలకు తాజాగా పేర్ల నమోదు సాకుతో పేదల కడుపు కొట్టడాన్ని తప్పుబట్టారు. గృహజ్యోతి, గృహలక్ష్మి పథకంలో మరో మారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో వైపు పెన్షన్ల విషయంలో ఆన్‌లైన్‌లో సర్వర్ సమస్యలంటూ వేధించడం సరికాదన్నారు. నెల సరి ఆదాయాన్ని రూ.32 వేలుగా నిర్ణయించడం తగదన్నారు. ఎస్పీటీఎస్పీ నిధుల వినియోగంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ధ్వజమెత్తారు. పాదయాత్రలో మాజీ మంత్రులు శ్రీరాములు, రాజుగౌడ, శాసన సభ్యుడు మానప్ప వజ్జల్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్, శరణమ్మ కామరెడ్డి తదితరులున్నారు.
పాదయాత్రలో విజయేంద్ర ఆరోపణ


