అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Sep 5 2026 5:37 AM | Updated on Sep 5 2026 5:37 AM

హుబ్లీ: జిల్లాలో మరో అన్నదాత అప్పులకు బలి అయ్యాడు. వివరాలు.. సాగు చేసిన పంట చేతికందక చేసిన అప్పులు తీర్చే మార్గం లేక జిల్లాలోని అణ్ణిగేరి తాలూకా వరకేరి వీధికి చెందిన రైతు శంకరప్ప గూళప్ప (80) పొలంలోనే విషం తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని అణ్ణిగేరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం గదగ్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక గురువారం మృతి చెందాడు. ఈ మేరకు అణ్ణిగేరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సౌరశక్తి పథకాలపై అవగాహన

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన వర్గాలు, దివ్యాంగులు ఆర్థిక స్వావలంబన సాధించాలని కమిషనర్‌ శరణప్ప సూచించారు. శుక్రవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో సేల్కో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రధాన సౌరశక్తి పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పీఎం సూర్యఘర్‌, రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్రోగ్రాంలపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీపీ ఈఓ చంద్రశేఖర్‌ పవార్‌, దివ్యాంగుల శాఖ అధికారిణి సరస్వతి, నరసింహ మూర్తి, సురేష్‌, హృతిక్‌ భండారి తదితరులు పాల్గొన్నారు.

బైక్‌లపై పిచ్చి.. దొంగగా మారి

హుబ్లీ: బైక్‌ నడపాలన్న ఆశ.. అలాగే జల్సాలకు అలవాటు పడిన బైక్‌ దొంగగా మారిన ఓ 20 ఏళ్ల యువకుడిని కొప్పళ నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని బళ్లారికి చెందిన మహమ్మద్‌ ఇర్ఫాన్‌గా గుర్తించారు. ఇతడి నుంచి 16 బైక్‌లను జప్తు చేశారు. బైక్‌ మెకానిక్‌గా పని చేసే ఇర్ఫాన్‌ వాహనాలు లాక్‌ తీయడానికి ప్రత్యేకంగా మాస్టర్‌ కీ సిద్ధం చేసుకున్నాడు. కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలో ఇతడు వివిధ వాహనాలను చోరీ చేశాడు. పోలీసుల బైక్‌ కూడా ఇతడు చోరీ చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. గత నెలలో కొప్పళ జిల్లా ఆస్పత్రిలో ఆవరణలో జరిగిన బైక్‌ చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించారు. కార్యచరణ జరిపి నిందితుడు మహమ్మద్‌ ఇర్ఫాన్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడు చోరీ చేసిన బైక్‌లను విడి భాగాలుగా విడదీసి కేవలం రూ.100, రూ.500లకు అమ్మే వాడు. కొన్ని సార్లు మొబైల్‌ ఫోన్లను తీసుకుని చోరీ చేసిన బైక్‌లను విక్రయించే వాడు. చిన్నప్పటి నుంచే చోరీ చేసే స్వభావాన్ని నేర్చుకున్న ఇతడిపై 8 పైగా కేసులు ఉన్నట్లు కొప్పళ ఎస్పీ సాహిల్‌బాగ్ర తెలిపారు.

సమస్యలపై గళం విప్పాలి

హొసపేటె: హొసపేటెలో నెలకొన్న సమస్యలపై శాసన సభలో గళం విప్పాలని కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా జిల్లా కమిటీ నాయకులు ఎమ్మెల్యే గవియప్పను కోరారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఆర్‌.భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. 2015 నుంచి నిరంతర పోరాటం చేస్తున్నప్పటికీ పట్టణంలో ఇప్పటి వరకు భూమి లేని వారికి ఒక్క ప్లాట్‌ కూడా కేటాయించలేదన్నారు. నగరంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్‌పాస్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కొత్త జిల్లా ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే అక్టోబర్‌లో నిరవధిక దర్నాకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎం.జంబయ్య నాయక్‌ కార్యదర్శి ఎన్‌.యల్లలింగ ఎం.గోపాల, జె.ఎం.చన్నబసయ్య తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి

ప్రజా సేవా అభియాన్‌

నేడు ప్రారంభించనున్న

సీఎం డీకే శివకుమార్‌

హొసపేటె: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడానికి, పాలనను ప్రజల ముంగిటకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సేవా అభియాన్‌ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలో శనివారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, క్రీడల శాఖ మంత్రి డాక్టర్‌.జీ.పరమేశ్వర, ముజ్రాయ్‌, మత్స్య, ఓడరేవులు, అంతర్గత జల రవాణా శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కేఎస్‌.బసవంతప్ప హాజరుకానున్నారు. రాష్ట్ర గ్యారంటీ పథకాల అమలు అథారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీటీ పరమేశ్వర నాయక్‌ హాజరవుతారు. కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్‌.ఎన్‌టి.శ్రీనివాస్‌ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.

పైప్‌ల తొలగింపు

రాయచూరు రూరల్‌: రాయచూరు, కొప్పళ జిల్లాల్లో తుంగభద్ర ఎడమ కాలువలో రైతులు అక్రమంగా వేసుకున్న పైప్‌లను తొలగించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. రెండు రోజుల నుంచి గంగావతి పరిధిలోని సోమనాళ, మైలాపూర్‌, చిక్క డంకన్‌కల్‌, కారటిగిలో జేసీబీల సహాయంతో అక్రమంగా వేసుకున్న పైప్‌లను తొలగిస్తున్నారు. రైతులు అక్రమంగా పైప్‌లు పెట్టుకుంటే చివరి ఆయకట్టు భూములకు నీరు అందడం కష్టంగా మారిందన్నారు. జలచౌర్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement