రాయచూరు రూరల్: మాన్వి తాలూకా కుర్డి గ్రామంలో వెలసిన సద్గురు రాజయోగిని పడివడికి తాత ఉత్సవాలు గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగాయి. కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య స్వామీజీ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా వందలాది మంది భక్తుల సమక్షంలో మహా రథోత్సవం నిర్వహించారు.
ఉచిత ఆరోగ్య శిబిరం
బళ్లారి రూరల్: లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా వారోత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. బళ్లారి ఎల్‌ఐసీ బ్రాంచ్–2లో శుక్రవారం ఎల్‌ఐసీ అధికారులు, సిబ్బందికి, ఏజెంట్లకు ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో వైద్యులు మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, కొలెస్ట్రాల్, కంటి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ హర్షవర్దన్, పారా మెడికల్ సిబ్బంది మృత్యుంజయ గౌడ, వినీలా రెడ్డి, వన్నప్ప, ఎల్‌ఐసీ సిబ్బంది, ఏజెంట్లు పాల్గొన్నారు.
ఘనంగా పుట్టి జాతర
రాయచూరు రూరల్: రాయచూరు నగరంలో శుక్రవారం మూన్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో పుట్టి జాతర వైభవంగా జరిగింది. లక్ష్మీ దేవి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ పుట్టి జాతరను మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురిసి, రైతుల జీవితాల్లో వెలుగులు నిండాలన్నారు. దేశం సుభిక్షంగా ఉండి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ఏటా ఈ పుట్టి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు.
కాలువ నిర్మాణం
పూర్తి చేయాలి
రాయచూరు రూరల్: జిల్లాలోని నారాయణపుర 9ఏ కాలువ నిర్మాణం పూర్తి చేయాలని అఖిల భారత కిసాన్ సంఘటన నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కవితాళ అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం సంచాలకుడు బసవ లింగప్ప మాట్లాడుతూ.. నారాయణపుర కాలువల నిర్మాణాలు పూర్తి చేసి రైతుల భూములకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. కవితాళ, సిరవార, మాన్వి తాలుకాలను కరువు ప్రాంతాలుగ ప్రకటించాలని కోరారు. అనంతరం వివిధ సమస్యలపై నాడ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
పౌర కార్మికులకు
నియామక పత్రాలు
హొసపేటె: నగర సభకు చెందిన 65 మంది పౌర కార్మికులకు స్థానిక ఎమ్మెల్యే హెచ్.ఆర్.గవియప్ప శుక్రవారం పార్టీ కార్యాలయంలో నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో పౌర కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా పట్టణాభివృద్ధి నిధి ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, నగర సభ కమిషనర్ శివకుమార్ జిల్లా గ్యారెంటీ పథకం అమలు కమిటీ ఉపాధ్యక్షురాలు కే.బడవాలి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవి కుమార్, మాజీ నగర పరిషత్ అధ్యక్షుడు గుజ్జల నింగప్ప, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


