● వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ
బంధువుల ఆరోపణ
హొసపేటె: నగరంలోని 60 పడకల ప్రభుత్వ తల్లి, శిశు ఆస్పత్రిలో ఓ చిన్నారి మృతి చెందింది. అయితే వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా చిన్నారి చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వివరాలు.. నగరానికి చెందిన వినయ్ భార్య మేఘనకు పురిటి నొప్పులు రావడంతో బుధవారం సాయంత్రం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రసవ సమయంలో బిడ్డ తల మాత్రమే బయటకు వచ్చింది. అక్కడ డాక్టర్లు లేకపోవడంతో పని మనుషులు ప్రసవం చేశారు. బిడ్డకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. తదుపరి చికిత్స కోసం బిడ్డను కొప్పళకు తీసుకెళ్లమని వైద్యులు వారిని పంపించారు. కొప్పళ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా బిడ్డ చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. మరణించిన శిశువును పిల్లల ఆస్పత్రికి తీసుకువచ్చిన బంధువులు ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. నిర్లక్ష్యం వహించిన వైద్యుడిని తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్.లింగరాజు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిర్లక్ష్యం వహించిన వైద్యుడిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే అంగీకరించని కుటుంబ సభ్యులు చిన్నారి మరణానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.


