రాయచూరు రూరల్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అనవసరంగా అట్రాసిటి కేసు పెట్టడంపై కాంగ్రెస్ పార్టీ జిల్లా సంఘం ఖండించింది. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఎమ్మెల్సీ వసంత కుమార్ మాట్లాడారు. దేశంలో కన్యాకుమారి నుంచి జమ్ము కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన వ్యక్తిపై కేంద్ర సర్కార్ తప్పుడు కేసులు బనాయించడం తగదన్నారు. ఆందోళనలో జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, నగర అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జయన్న, శాంతప్ప, శివమూర్తి, పామయ్య మురారి, అమరేగౌడ, శ్రీదేవి నాయక్, మంజులున్నారు.
నిరుద్యోగులకు ఉపాధి కల్పించండి
రాయచూరు రూరల్: రాష్ట్ర సర్కార్ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఏఐడీవైఓ డిమాండ్ చేిసింది. మంగళవారం టిప్పు సుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మహేష్ మాట్లాడారు. మూడేళ్లు పూర్తి చేసుకున్న సర్కార్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. త్వరితగతిన ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు.
యడ్డి, విజయేంద్రలకు సన్మానం
రాయచూరు రూరల్: మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి మఠంలో 355వ ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి రాఘవేంద్ర స్వాముల మఠంలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. రాఘవేంద్ర స్వామి మూల విరాట్‌కు ఊంజల్ సేవలు చేశారు. అనంతరం మఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ఇద్దరిని శాలువా కప్పి సన్మానించారు.
హెస్కాం సిబ్బందిపై దాడి
హుబ్లీ: విద్యుత్ తీగల మరమ్మత్తు కోసం కరెంట్ సరఫరా నిలిపి వేసిన హెస్కాం సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన కుందగోళ తాలూకా సిరియూరు గ్రామంలో చోటు చేసుకుంది. సంశి హెస్కాం కార్యాలయ ఉద్యోగి అకర్ ఉల్లాజి దాడికి గురైన వ్యక్తి. ఇతడు సిరియూరులో తెగి పడిన విద్యుత్ తీగలను సరి చేయడానికి కరెంట్ సరఫరాను ఆపాడు. కోపోద్రిక్తుడైన స్థానికుడు డ్యూటీలో ఉన్న సిబ్బందిపై చెంపదెబ్బ కొట్టాడు.
వస్త్ర దుకాణంలో చోరీ
మరో ఘటనలో వస్త్ర దుకాణంలో మంగళసూత్రం చోరీ చేసిన ఘటన స్థానిక దాజిబాని పేటలో జరిగింది. బట్టల దుకాణంలో చీరలు కొనేటప్పుడు రూ.4.50 లక్షల విలువ చేసే 35 గ్రాముల మంగళసూత్రం, రూ.1200 నగదు ఉన్న వ్యానిటీ బ్యాగ్‌ను చోరీ చేశారు. కూబిహాళ నాగరత్నకు చెందిన ఆభరణాలు ఉన్న బ్యాగ్ చోరీకి గురైంది. నాగరత్న తన చెల్లెలు జ్యోతికి బ్యాగ్ ఇవ్వగా దాన్ని ఎవరో చోరీ చేశారని హుబ్లీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విధుల్లో అలసత్వం
ప్రదర్శిస్తే చర్యలు
రాయచూరు రూరల్: జిల్లాలో విధి నిర్వహణలో అలసత్వం చేసే అధికారులపై చర్యలు చేపడతామని సంచార గిరిజన మండలి కమిషన్ అద్యక్షుడు ఎన్.మూర్తి అధికారులపై మండిపడ్డారు. రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించి జెడ్పీ భవనంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళల్లో సమస్యలపై స్పందించిన ఆయన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. అక్రమ మద్యం, హత్యలు, అత్యాచారాల కేసులు అధికం కావడం సిగ్గుచేటన్నారు. జిల్లాధికారిణి పూవిత, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగర పాలక కమిషనర్ జుబీన్ మహాపాత్రోలున్నారు.


