సాక్షి,బళ్లారి: ఉమ్మడి బళ్లారి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేయండని మాట్లాడే ముందు మీరు గంగావతి ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి, గెలిచిన తర్వాత ఉమ్మడి బళ్లారి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల గురించి మాట్లాడాలని లోక్‌సభ సభ్యుడు తుకారాం, రాజ్యసభ సభ్యుడు నాసిర్ హుస్సేన్, ఎమ్మెల్యేలు నాగేంద్ర, నారా భరత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని కమ్మభవన్‌లో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు విలేకరుల సమావేశంలో పాల్గొని గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములుపై నిప్పులు చెరిగారు. మా దమ్ము గురించి మాట్లాడే ముందు మీకు ఎంత దమ్ము ఉందో తెలుసుకోవాలన్నారు. ఇటీవల జరిగిన సండూరు ఉప ఎన్నికల్లో మీ నాయకత్వంలోనే బీజేపీ పోటీ చేస్తే, అక్కడ బీజేపీ అభ్యర్థి చిత్తుచిత్తుగా ఓడిపోలేదా అని ప్రశ్నించారు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఒక మహిళను ఎన్నికల్లో కాంగ్రెస్ నిలబెట్టి గెలిపించిందని గుర్తు చేశారు. సండూరు ఉప ఎన్నికల్లో గెలవలేని మీరు, జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల గురించి మాట్లాడతారా అని ఎద్దేవా చేశారు.
నేను స్వచ్ఛందంగా రాజీనామా చేశా
తాను స్వంత నిర్ణయంతో రాజీనామా చేశాను కాని ఎవరి ప్రోద్బలంతోనో కాదని నాగేంద్ర అన్నారు. గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు ఇద్దరూ చెల్లని నాణేలు అని పరోక్షంగా విరుచుకుపడ్డారు. గాలి జనార్దనరెడ్డి ఎన్ని రాజకీయ ఎత్తులు వేసినా, అందుకు ప్రతీగా తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. గంగావతిలో రాజీనామా చేసి గెలిస్తే, తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని పలువురు ఎమ్మెల్యేలు ఘాటు హెచ్చరికలు చేశారు. వాల్మీకి అభివృద్ధి నిగమలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తప్పు చేసి ఉంటే కోర్టు ఏ శిక్ష వేసినా అనుభవిస్తానన్నారు. చివరకు ఉరిశిక్ష వేసినా సంతోషంగా స్వీకరిస్తాన్నారు. మీ అక్రమాల చిట్టా విప్పితే మీకు పుట్టగతులు ఉండవన్నారు.గాలి జనార్దనరెడ్డి చేసిన అక్రమాల్లో శ్రీరాములుకు కూడా వాటా ఉందన్నారు. ఎమ్మెల్యేలు గణేష్, అన్నపూర్ణ, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, బుడా అధ్యక్షుడు జే.ఎస్ ఆంజనేయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అక్కడ గెలిస్తే మేం రాజకీయ
సన్యాసం స్వీకరిస్తాం
గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములుపై కాంగ్రెస్ నేతలు గరం


