రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు, వరుస హత్యలను ఖండిస్తూ కర్ణాటక దళిత సంఘర్ష సమితి(రిజిస్టార్) బళ్లారి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో నిరసన చేపట్టారు. నగరంలోని మర్చేడ్ హోటల్ నుంచి పాత జిల్లాధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లాధికారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. దళితులపై అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు మాట్లాడుతూ జిల్లాలో భూమానంద, అశ్విని, రాణెమ్మల అత్యాచారం, హత్య ఘటనలను ప్రస్తావిస్తూ దళితులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.


