ఇందిరా క్యాంటీన్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఇందిరా క్యాంటీన్‌ ప్రారంభం

Sep 4 2026 1:48 AM | Updated on Sep 4 2026 1:48 AM

హొసపేటె: జిల్లా స్టేడియం సమీపంలో నూతన ఇందిరా క్యాంటీన్‌ను బళ్లారి ఎంపీ తుకారాం గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా క్యాంటీన్‌ పథకం వల్ల పేదలు ఎంతో లబ్ధి పొందుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన ప్రజా సేవా కార్యక్రమాన్ని ఈనెల 5న జిల్లాలోని కూడ్లిగిలో ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌ ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అఖండ జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. జిల్లాధికారిణి కవిత మన్నికేరి, జిల్లా అభివృద్ధి అధికారి మనోహర్‌, నగరసభ అధ్యక్షుడు రూపేష్‌ కుమార్‌, తహసీల్దార్‌ శృతి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి హజ్‌ యాత్రకు విరాళాల సేకరణ

హుబ్లీ: ఇస్లాం శ్రేష్ట మతం అని, హజ్‌యాత్రకు వెళ్లాలని కోరిక ఉన్నట్లు ప్రకటించిన మంత్రి బసవరాజ రాయరెడ్డికి ఇవ్వడానికి బీజేపీ కార్యకర్తలు నగరంలో విరాళం సేకరించారు. మఠం, మందిరాలకు వెళ్లనని పేర్కొన్న రాయరెడ్డి వ్యాఖ్యలను ఖండిసూత బీజేపీ హుబ్లీ ధార్వాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం యువ మోర్ఛా ఆధ్వర్యంలో నగర మార్కెట్‌లో విరాళాల సేకరణతో నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారులు, ప్రజల నుంచి కార్యకర్తలు మొత్తం రూ.1,060 సేకరించి రాయరెడ్డికి పంపడానికి ఏర్పాట్లు చేశారు. సంజయ్‌, ప్రమోద్‌, అమిత్‌, నాగరాజు, మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

మహారాష్ట్ర నుంచి నీరు విడుదల చేయించండి

రాయచూరు రూరల్‌: మహారాష్ట్ర పైభాగంలో అధికంగా వానలు కురుస్తుండడంతో ఉజ్జయిని డ్యాం నుంచి కలబుర్గి నగరానికి తాగునీటిని విడుదల చేయించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే అధికారులకు సూచించారు. కలబుర్గి జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాదగిరి జిల్లాల్లో భీమా నదిలో నీటి ప్రవాహం కరువైందన్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రతిపాదనలను రూపొందించి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసి నీటి విడుదలకు ప్రయత్నించాలన్నారు. సమావేశంలో శాసన సభ్యులు తిప్పణ్ణప్ప కమకనూరు, ఎంవై పాటిల్‌, భీమా నది కమిటీ సభ్యులున్నారు.

పుష్కరిణి తవ్వాలని డిమాండ్‌

పురావస్తు శాఖకు శెట్టర్‌ లేఖ

హుబ్లీ: ఆచార్‌ వీధిలోని శ్రీభవాని శంకర్‌ నారాయణ దేవస్థానం ఎదుట పుష్కరణి ఉనికిపై బాంబే ప్రెసిడెన్సీ గిరిథియార్‌ ఉల్లేఖించారు. ఈ నేపథ్యంలో తవ్వడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ సీఎం, ఎంపీ జగదీశ్‌ శెట్టర్‌ పురావస్తు సంగ్రహాలయ, పరంపర శాఖకు లేఖ రాశారు. సదరు దేవస్థానం చారిత్రాత్మక ప్రాధాన్యత గల ప్రాచీన దేవాలయం శతాబ్దాలుగా పురాతనమైనది. కేంద్ర ప్రభుత్వ పురావస్తు సంగ్రహాలయ పరంపర శాఖ సురక్షిత స్మారకమని ప్రకటించింది. అయినా ఆలయానికి 57 మీటర్ల అంతరంలో పుష్కరిణి ఉన్న స్థలంలో రోడ్డును నిర్మించారు. సురక్షిత స్మారకం అయినా కూడా నిరభ్యంతర పత్రం తీసుకోకుండా రోడ్డు నిర్మాణం చేపట్టడం ఖండనీయం అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అందుకే నిజాల వెలికితీతకు తవ్వకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

నేత్రదానంపై అవగాహన ర్యాలీ

హుబ్లీ: డాక్టర్‌ అగర్వాల్‌ ఆస్పత్రి, సెయింట్‌మేరీ స్కూల్‌, విఘ్నేశ్వర, మార్టిన్‌ లూథర్‌ నర్సింగ్‌ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ కృష్ణ నాడగౌడ, రైల్వే ఆస్పత్రి సీఎండీ డాక్టర్‌ కృష్ణారెడ్డి, ఏసీపీ వీరేష్‌ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో 175 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కాగా త్వరలో వృద్ధులకు డాక్టర్‌ అగర్వాల్‌ ఆస్పత్రిలో ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు. ఆసక్తి గలవారు సంప్రదించాలని ఆస్పత్రి వీఆర్‌ఓ కోరారు.

గంజాయి విక్రేత అరెస్ట్‌

కోలారు: గంజాయి విక్రేతను అరెస్టు చేసిన పోలీసులు.. రూ.50 వేలు విలువ చేసే 573 గ్రాముల గంజాయి, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు .. బంగారుపేటె పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బెమెల్‌లోని విజయనగర 9వ క్రాస్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో దాడి చేసి ఉరిగాంపేటెకు చెందిన రాజ్‌ కిరణ్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు పారిపోయాడు.

చెరువు పనులు ప్రారంభం

కోలారు: బంగారుపేటె తాలూకాలోని కారమంగల గుట్టహళ్లి, యళేసంద్ర, మాగొంది గ్రామాలలో చెరువుల పునశ్చేతన పనులను సెహగల్‌ ఫౌండేషన్‌ ద్వారా గురువారం ప్రారంభించారు. ఫౌండేషన్‌ సిబ్బంది మాట్లాడుతూ జిల్లాలోని చెరువులలో నీటి నిల్వను పెంచడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. చుట్టుపక్కల ప్రాంతాలలో అంతర్జలాల స్థాయి కూడా పెరుగుతుందన్నారు. చెరువులలో పూడిక తీసిన మట్టిని రైతుల పొలాలకు అందజేస్తామని, దీనివల్ల భూమి సారవంతమవుతుందన్నారు. రైతులు, చెరువు వాడకందారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

శ్రద్ధగా చదువుకోవాలి

కోలారు: తల్లిదండ్రులు బాధపడేలా పిల్లలు ప్రవర్తించరాదని, తల్లిదండ్రులు కూడా పిల్లలను గొప్ప ఆస్తిగా చేయాలని భైరేగౌడ విద్యా సంస్థ కార్యదర్శి వి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం నగర సమీపంలోని కృష్ణా కళ్యాణ మంటపంలో భైరేగౌడ విద్యాసంస్థ నూతన తరగతుల ప్రారంభోత్సవం నిర్వహించారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌.మంజుల, డాక్టర్‌ యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement