హొసపేటె: తుంగభద్ర డ్యాంలోకి గురువారం తుంగభద్ర మండలి కార్యదర్శి శ్రీనివాస బైరి, ఎస్‌ఈ రమేష్‌నాయక్ చేతుల మీదుగా చేప పిల్లలను విడుదల చేశారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి కూడా జలాశయంలోకి చేప పిల్లలను వదిలారు. మండలి కార్యదర్శి మాట్లాడుతూ ఈ సారి డ్యాంలోకి సుమారు 14 లక్షల చేప పిల్లలను విడుదల చేశామన్నారు. చేపల పెంపకం అభివృద్ధి అధికారి అశ్వత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆయకట్టుకు నీరందించండి
రాయచూరు రూరల్: జిల్లాలో తుంగభద్ర ఎడమ కాలువ నుంచి ఆయకట్టు చివరి భూములకు నీరు అందించాలని కలబుర్గి ప్రాంతీయ కమిషనర్ జహీరా నసీం అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచూరు జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర ఎడమ కాలువలో నీటి సామర్థ్యాన్ని తెలిపే గేజ్ నిర్వహణకు కొప్పళ జిల్లాధికారి పక్కా ఆదేశాలు జారీ చేయాలన్నారు. తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. భవిష్యత్తులో పశువులకు గ్రాసం కొరత నివారించాలని సూచించారు. జిల్లాధికారిణి పూవిత, సురేష్ హిట్నాల్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగర పాలక కమిషనర్ జుబీన్ మహాపాత్రోలున్నారు.
పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి
రాయచూరు రూరల్: నగరంలో స్వచ్ఛతకు ప్రాధాన్యత కల్పించాలని సిటీ కార్పొరేషన్‌న్‌కమిషనర్ మల్లికార్జున సూచించారు. గురువారం జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా దేశ స్థాయిలో ప్రథమ స్థానం అలంకరించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో రాయచూరు సిటీ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుని స్వచ్ఛత, ముడి వస్తువుల సేకరణ, ఇతర పనుల నిర్వహణపై తర్ఫీదు ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు. సమావేశంలో అధికారులు రాఘవేంద్ర, సంపత్, జయపాల్ రెడ్డి తదితరులున్నారు.
అశ్వినికి న్యాయం చేయాలని ధర్నా
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హొక్రాణిలో దళిత యువతి అశ్వినిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి, కేసును నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని దళిత పర సేన సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు సణ్ణబాబు మాట్లాడారు. అశ్విని మృతికి కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. ఇటీవల జిల్లాలో దళిత యువతులు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
6న ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ రాత పరీక్ష
హొసపేటె: కర్ణాటక పరీక్ష ప్రాధికార సంస్థ ఈనెల 6న సాయుధ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కోసం రాత పరీక్షను నిర్వహిస్తోంది. అత్యంత పారదర్శకంగా ఈ పరీక్షను నిర్వహించాలని జిల్లాధికారిణి కవిత మన్నికేరి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ హొసపేటెలో మొత్తం 9 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఉదయం పరీక్షకు 4,406 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం పరీక్షకు 4,500 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్ష సమయంలో ఎలాంటి గందరగోళం లేకుండా, పకడ్బందీగా నిర్వహించాలని ఆమె కట్టుదిట్టమైన ఆదేశాలు ఇచ్చారు.


