శ్వేతపత్రం విడుదల చేయండి | - | Sakshi
Sakshi News home page

శ్వేతపత్రం విడుదల చేయండి

Sep 4 2026 1:48 AM | Updated on Sep 4 2026 1:48 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో నెలకొన్న కరువు, వర్షాభావం, పంట నష్టం, రైతుల ఆత్మహత్యలు తదితర అన్ని అంశాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర డిమాండ్‌ చేశారు. ఆయన గురువారం మూడో రోజు బీజేపీ నేతలు లింగసూగూరు నుంచి బళ్లారికి చేపట్టిన పాదయాత్రలో భాగంగా సింధనూరు తాలూకా గుడదూరు కరిబసవేశ్వర ఆలయం వద్ద నుంచి ఎద్దులబండిలో పాదయాత్రకు బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నవలి సమాంతర జలాశయ నిర్మాణం మరుగున పడిందని ఎద్దేవా చేశారు. తుంగభద్ర డ్యాంలో 33 టీఎంసీల మేర పూడిక పేరుకు పోవడంతో ప్రత్యామ్నాయంగా సమాంతర జలాశయాన్ని నవలి వద్ద నిర్మించడానికి భూమిపూజ చేసినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. నందవాడిగి ఎత్తిపోతల పథకాన్ని కూడా నీరుగార్చారని ధ్వజమెత్తారు.

అధికార యావే తప్ప స్పందన ఏదీ?

రైతులు తగిన వర్షాలు కురవక కరువుతో సతమతమవుతూ అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నా అధికార పార్టీ నాయకులు సమస్యలపై స్పందించకుండా అధికారం కోసం పాకులాడుతున్నారన్నారు. దళితుల పేరు చెప్పుకుని అధికారం చేపట్టిన నేతలు వాల్మీకి అభివృద్ధి మండలిలో అవినీతికి పాల్పడ్డారన్నారు. దళితులకు కేటాయించిన నిధులను వారి సంక్షేమానికి వ్యయం చేయకుండా స్వాహా చేశారన్నారు. పేరుకు మాత్రమే రాష్ట్రంలో మంత్రులు, ముఖ్యమంత్రులు కరువు పరిశీలన పర్యటనలు చేపట్టారన్నారు. 2028లో రాష్ట్రంలో బీజేపీ ఎన్‌డీఏ నేతృత్వంలోని ప్రభుత్వమే అధికారం చేపడుతుందన్నారు. పాదయాత్రలో మాజీ మంత్రులు శ్రీరాములు, గాలి జనార్దనరెడ్డి, శివనగౌడ నాయక్‌, రాజు గౌడ, శాసన సభ్యులు మానప్ప వజ్జల్‌, శివరాజ్‌ పాటిల్‌, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement