హొసపేటె: బళ్లారి రహదారి సమీపంలోని కారిగనూరు వద్ద ఉన్న రెవెన్యూ భూమిని కంపెనీలకు లీజుకు ఇవ్వకూడదని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కారిగనూర్ సమీపంలోని ఆర్‌బీఎస్‌ఎస్‌ఎన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రాథమిక సౌకర్యాల కల్పనకు కేటాయించిన భూమిని ఏ కారణం చేత కూడా ఆర్‌బీఎస్‌ఎస్‌ఎన్ కంపెనీకి ఇవ్వకూడదన్నారు. మాజీ మంత్రి ఆనంద్‌సింగ్ ఆందోళనకారులకు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది రూ.ఐదు వేల కోట్ల రూపాయల కుంభకోణం అని ఆరోపించారు. సదరు భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ లీజుకు ఇవ్వకూడదని ముఖ్యమంత్రి డీకే. శివకుమార్‌కి లేఖ రాయడం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తానని పేర్కొన్నారు. హొసపేటె జిల్లా కేంద్రంగా మారినందున ప్రాథమిక సౌకర్యాల కల్పనకు భూమిని కేటాయించాలని సూచించారు. లీజు గడువు ముగిసినందున కంపెనీ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకూడదని డిమాండ్ చేశారు. మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు రూపేష్ కుమార్, ఉపాధ్యక్షుడు బి.జీవరత్నం, స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడు శరవణ్ మున్సిపల్ సభ్యులు జీ.ఎస్.మనుమంతప్ప, తరిహళ్లి జంబునాథ్, వివిధ సంస్థల నాయకులు సీఆర్.భరత్, ద్వారకీష్ తదితరులు పాల్గొన్నారు.


