బళ్లారి అర్బన్: దళిత రైతు హెచ్.గలెప్పపై దాడి చేసి, కులం పేరుతో అవమానించిన సిరుగుప్ప సబ్ రిజిస్ట్రార్ యల్లారెడ్డెప్ప వెంటనే అరెస్టు చేయాలని కర్ణాటక ప్రాంత రైతు సంఘం జిల్లా కమిటీ, వివిధ సంస్థల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని పత్రికా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మారుతీ, శివశంకర్ మాట్లాడారు. ఆగస్టు 13న తన పొలంలో పని చేసుకుంటున్న గలెప్పపై యల్లా రెడ్డెప్పతో పాటు మరో ఐదుగురు దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై టెక్కల్కోట పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదైనా నిందితులను ఇప్పటికీ అరెస్టు చేయలేదని తెలిపారు. యల్లా రెడ్డెప్ప ఆగస్టు 17న దార్వాడ హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు తిరస్కరించిందన్నారు. వెంటనే అతడిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సర్వే నంబర్–64లో హలేకోట దేవలాపూర్ గ్రామాలకు చెందిన సుమారు 143 ఎకరాల 32 సెంట్ల భూమిని కర్ణాటక ప్రభుత్వం పేరుతో రిజిస్టర్ చేసినట్లు ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు. ఈ భూమిని సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం వెంటనే టైటిల్ డీడ్స్ జారీ చేయాలని కోరారు. సమావేశంలో మునియప్ప, మల్లయ్య, ఓబ్లేశ్వరప్ప, మారుతీ గలెప్ప, నాగరాజ్, బసప్ప పాల్గొన్నారు.


