బళ్లారి రూరల్: నేపాల్ వరదల్లో ఆప్తులను కోల్పోయిన అభాగ్యులను కరుణామయుడు ఏసయ్య ఆదుకోవాలని బెంగుళూరు ధర్మాధ్యక్షుడు డాక్టర్ ఆరోగ్యరాజ్ సతీష్ కుమార్ ప్రార్థనలు చేశారు. మేరీమాత ఉత్సవాల్లో భాగంగా సభాంగణంలో ఏర్పాటు చేసిన పార్థనా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సకల మానవులందరూ ఆరోగ్యం, సుఖసంతోషాలతో జీవించేలా ఆ దేవదేవుడి ఆశీర్వాదం ఉండాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో ఫాదర్ ఆరోగ్యనాథన్, ఫాదర్ ఐవన్‌పింటో, కర్ణాటక క్రైస్తవ అభివృద్ధి మండలి అధ్యక్షుడు జి.జె రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎంబీబీఎస్ విద్యార్థికి
ఆర్థిక సాయం
సాక్షి, బళ్లారి: ప్రతిభ గల పేద విద్యార్థులకు పేదరికం అడ్డుకాకూడదని మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్‌రెడ్డి, ఆయన సతీమణి నారా శైలజారెడ్డి తెలిపారు. హడగలి తాలూకా హోళథు గ్రామానికి చెందిన ఈరప్ప కనవి కుమారుడు భరత్ కనివి ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి కొప్పళ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. ఫీజు చెల్లించేందుకు విద్యార్థి పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న శ్రీసాయి సర్వీస్ ట్రస్టు బాసటగా నిలిచింది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న భరత్ కనివికి ట్రస్టు తరఫున నారా ప్రతాప్‌రెడ్డి దంపతులు రూ.75 వేల చెక్కు అందజేశారు. రాబోయే రోజుల్లో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను గుర్తించి ఆర్థిక సాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో రెడ్డి జన సంఘం కార్యదర్శి తిమ్మారెడ్డి, ట్రెజరర్ హేమచంద్రారెడ్డి, డైరెక్టర్ మరిస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ శాంతల
సేవలు అమూల్యం
బళ్లారి రూరల్: బీఎంసీఆర్‌సీలో డాక్టర్ శాంతల అందించిన సేవలు మరువరానివని ఆ సంస్థ డీన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ మరిరాజ్ కొనియాడారు. సోమవారం వైద్య భవన్‌లో వైద్య కళాశాల బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శాంతల, నాన్–టీచింగ్ ఉద్యోగి రాజశేఖర్ ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మరిరాజ్ మాట్లాడుతూ.. తాను హౌస్‌సర్జన్ చేస్తున్న సమయంలోనే డాక్టర్ శాంతల విమ్స్‌లో వైద్యురాలిగా వృత్తిని ఆరంభించారని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె అంచలంచెలుగా మూడు వైద్య కోర్సులు పూర్తి చేసి, ప్రతిభావంతురాలైన వైద్యురాలిగా ఎదిగారని పేర్కొన్నారు. అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో నాన్–టీచింగ్ ఉద్యోగిగా పని చేసిన రాజశేఖర్ బాధ్యతగా విధులు నిర్వర్తించారన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన డాక్టర్ శాంతల, రాజశేఖర్‌ను కళాశాల వైద్యులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.
కాలువలో దూకి
యువతి ఆత్మహత్య
హొసపేటె: నగరంలో రైల్వే స్టేషన్ రహదారిలో ఉన్న పవర్ కెనాల్‌లోకి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. బళ్లారి జిల్లా కౌలుబజార్‌కు చెందిన లుబ్న తబుసమ్ (22) పవర్ కెనాల్ వద్దకు వచ్చింది. అందరూ చూస్తుండగా ఒక్కసారిగా కాలువలోకి దూకేసింది. గమనించిన స్థానికులు.. వెంటనే కాలువలోకి దూకి యువతిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే నీటి ప్రవాహ వేగానికి తబుసమ్ కొట్టుకుని పోయి మృతి చెందింది. స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది నీటిలో తేలుతున్న యువతి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. చిత్తవాడిగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లుబ్న తబుసమ్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
డాక్టర్ శాంతలను సన్మానిస్తున్న వైద్యులు


