కూడ్లిగి బంద్‌ ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

కూడ్లిగి బంద్‌ ప్రశాంతం

Sep 1 2026 3:00 AM | Updated on Sep 1 2026 3:00 AM

హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగిని కరువు పీడిత తాలూకాగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం బంద్‌కు పిలుపునిచ్చారు.పలు ప్రజా సంఘాలు, పట్టణ ప్రజల నుంచి బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు లభించింది. ఉదయం నుంచి వాహనాల రాకపోకలు ఆగిపోగా.. దుకాణాలు మూసివేశారు. గాంధీ అస్తికలను భద్రపరిచిన అమరవీరుల స్మారక చిహ్నం నుంచి నిరసన ప్రదర్శన ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పర్యటించి, మదకరి సర్కిల్‌ వద్ద బహిరంగ సమ్మె చేపట్టారు. నిరసనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు, విజయనగర్‌ ఎస్పీ ఎస్‌.జాహ్నవి నేతృత్వంలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అఖిల కర్ణాటక రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవర మహేష్‌ మాట్లాడుతూ.. తాలూకాలో తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం తాలూకాను కరువు జాబితా నుంచి తొలగించడం సరికాదన్నారు.

రైల్వే స్టేషన్‌

అభివృద్ధిలో నిర్లక్ష్యం తగదు

రాయచూరు రూరల్‌: రాయచూరు రైల్వే స్టేషన్‌ అభివృద్ధి విషయంలో అదికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌ ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం నగరంలోని రైల్వే స్టేషన్‌లో గతి శక్తి పథకంలో భాగంగా కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు. ఇప్పటికే కేంద్రం నుంచి రూ.29 కోట్ల నిధులు విడుదలైనప్పటికీ పనులు ప్రారంభించక పోవడంతో ఇంజినీర్లపై మండిపడ్డారు. స్టేషన్‌లో తాగునీటి సమస్య, శౌచాలయాలు, ఫ్లాట్‌ పాంల శుభ్రతలపై దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు సమర్థ, శ్రీద్యాన ప్రకాష్‌, అశోక్‌, జయణ్ణ, జయంతి పతంగి, సాజిద్‌ పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

రాయచూరు రూరల్‌: జిల్లాలో మృతి చెందిన దళిత కుటుంబాలకు పరిహారం అందించి, ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి అజయ్‌ ధరమ్‌ సింగ్‌ తెలిపారు. సోమవారం ఇటీవల మృతి చెందిన లింగసూగూరు తాలూకా కరకడకల్‌లో రాణెమ్మ, హద్దనాళలో భూమానంద, హోక్రాణి గ్రామంలో అశ్విని కుటుంబాలను పరామర్శించారు. హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని జిల్లా అధికారి, పోలీస్‌ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో శౌచాలయాలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో విధాన పరిషత్‌ సభ్యుడు బోసురాజ్‌, ఎమ్మెల్యే హంపయ్య నాయక్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ హంపణ్ణ, అదనపు ఎస్పీ హరీష్‌, సిరవార తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, అధికారి రోణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement