సాక్షి, బళ్లారి: వాల్మీకి అభివృద్ధి నిగమ మండలిలో జరిగిన అవినీతికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వాల్మీకి అబివృద్ధి నిగమ మండలిలో అవినీతికి ఒక్క నాగేంద్ర బాధ్యుడు కాదని.. ప్రభుత్వం పాత్ర కూడా ఉందని ఆరోపించారు. లింగసూగూరు నుంచి బళ్లారికి యథావిధిగా పాదయాత్ర కొనసాగిస్తామన్నారు. ఆదివారం మోకా రోడ్డులోని బీజేపీ కార్యాలయంలో మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి, మాజీ మంత్రి బి.శ్రీరాములు, మాజీ పార్లమెంట్ సభ్యుడు సన్న పక్కీరప్ప తదితరుల నేతృత్వంలో పాదయాత్రకు సంబంధించిన లోగో విడుదల చేశారు. సెప్టెంబర్ 1వ తేదీన రాయచూరు జిల్లా లింగసూగూరు నుంచి ప్రారంభమయ్యే బీజేపీ పాదయాత్ర.. సెప్టెంబర్ 10వ తేదీ వరకూ కొనసాగుతుందన్నారు. రాయచూరు, కొప్పళ జిల్లాల్లోని లింగసూగూరు, మస్కీ, కారటగి, గంగావతి, కంప్లి తదితర పలు గ్రామాల మీదుగా పాదయాత్ర బళ్లారికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా బీజేపీ ప్రముఖులు మాట్లాడుతూ.. వాల్మీకి నిగమ మండళిలో జరిగిన అవినీతిలో నాగేంద్ర రాజీనామా చేసినా పాపం పరిహారం కాలేదన్నారు. ఇందులో భాగస్వాములైన వారందరూ కూడా నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వాల్మీకి నిగమ మండలిలో జరిగిన అవినీతితో బళ్లారి లోక్‌సభ సభ్యుడు తుకారం గెలిచారన్నారు. ఆయన కూడా రాజీనామా చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే సురేష్ బాబు, బీజేపీ ప్రముఖులు హనుమంతప్ప, ఓబుళేసు తదితరులు పాల్గొన్నారు.


