జేసీబీతో మట్టిని తొలగిస్తున్న దృశ్యం
కాలువలో పేరుకుపోయిన పూడిక, చెత్తా చెదారం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలోని నారాయణపూర్ కుడి కాలువల శుభ్రత పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఆయకట్టు చివరి భూములకు సైతం నీరందించాల్సి ఉండగా కాలువలు పిచ్చి మొక్కలు, పూడిక, చెత్తా చెదారంతో నిండిపోయాయి. కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పూడిక పేరుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. లింగసుగూర్‌లోని కృష్ణా భాగ్య జల నిగమ మండలి అధికారులు జేసీబీల సహాయంతో కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం, పిచ్చి మొక్కలు, మట్టిని తొలగించే పనులు చేపట్టారు. మరో రెండు రోజుల్లో కాలువలకు నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో హడావుడిగా శుభ్రత పనులు చేపట్టడం గమనార్హం. కాలువలకు నీరు విడుదలకు సమయం దగ్గర పడటంతో అధికారులు తూతూమంత్రంగా శుభ్రత పనులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కాలువ పనులను బాధ్యతగా చేపట్టి ఆయకట్టుకు నీరు అందేలా అధికారులు చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


