రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్ ధర్మసింగ్ అధికారులను ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎరువులు సరఫరా చేయడం లేదు. కళ్యాణ కర్ణాటక పరిధిలోని కలబుర్గి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, బీదర్, యాదగిరి, విజయనగర, బాగల్‌కోట జిల్లాల్లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు డిమాండ్ పెరిగింది. అయితే సరఫరా తగినంతగా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొప్పళలో ఆదివారం ఎరువుల దుకాణాల ఎదుట గంటల తరబడి వేచి చూసినా ఎరువులు లభించక పోవడంతో ఓ రైతు నోట్లో మట్టి పెట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు. యూరియా, డీఏపీ కోసం 44 సహకార సంఘాల వద్ద రైతులు ఎదురు చూస్తున్నట్లు సమాచారం. రాయచూరు ఏపీఎంసీకి 50 టన్నుల యూరియా సరఫరా కాగా.. కొద్ది సేపటికే నిల్వలు ఖాళీ అయ్యాయి. జిల్లాకు 72 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటి వరకు కేవలం 900 మెట్రిక్ టన్నులు మాత్రమే పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. యూరియా కోసం రైతులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలోని గద్వాల, మక్తల్, నారాయణపేట, కృష్ణ, మాగనూరు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మాధవరం, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాలకు వెళ్లి 50 కిలోల యూరియా బస్తాకు అదనంగా రూ.50 చెల్లించి కొనుగోలు చేస్తున్నామని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 5,53,883 హెక్టార్లలో పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రకాశ్ చౌహాన్ తెలిపారు.


