సాక్షి, బళ్లారి: కొప్పళ పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (కుడా)లో భారీ అవినీతి, అక్రమాలు వెలుగుచూశాయి. నగరాభివృద్ధి పరిధిలో ఇంటి స్థలాలు ఇప్పిస్తామని నమ్మబలికి ప్రాధికార సంస్థ పేరుతో అనధికార బ్యాంకు ఖాతా తెరిచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణ. ఇందుకు సంబంధించి అధికారంగా ఆడిట్ చేయడంతో ఏకంగా రూ.8.43 కోట్లు అవినీతి జరిగిందని తేలింది. ఈ వ్యవహారంలో రోజు వారి వేతన ప్రాతిపదికన పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రవీంద్ర ప్రధాన నిందితుడు. కొప్పళ ఆస్పత్రి వెనక ఉన్న సరోజా లేఅవుట్‌లో స్థలాలు ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి డబ్బు తీసుకున్నట్లు సమాచారం. ఈ కుంభకోణంలో ఒక్క రవీంద్ర మాత్రమే కాకుండా ప్రాధికార సంస్థలోని కొందరు అధికారులు, బయట వ్యక్తులు, బ్యాంకు సిబ్బంది కూడా ప్రమేయం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రవీంద్రను ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత కూడా డబ్బు బదిలీ జరిగినట్లు.. అలాగే ప్రాధికార సంస్థకు చెందిన కొందరు అధికారుల సంతకాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కుడా కమిషనర్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అధికారులు, పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొప్పళ ప్రాధికారలో జరిగిన అక్రమాలపై ప్రతిపక్ష నేత ఆశోక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని స్థాయిల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణాలు, నగరాభివృద్ధి సంస్థలు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారాయన్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో రూ.8.43 కోట్లు వసూలు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి
ప్రధాన నిందితుడు


