హుబ్లీ: స్నాక్స్ ప్యాకెట్లలో గంజాయి చాక్లెట్‌లను విక్రయిస్తున్న నిందితుడిని బెళగావి పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యమ్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలేజీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బోలు ప్రజాప్రతి అనే వ్యక్తి స్నాక్స్ ప్యాకెట్లలో గంజాయి నింపి చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.54 వేల విలువ చేసే 6 కేజీల గంజాయి, ఓ ఫోన్, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
వేతనాలు అందించాలని ర్యాలీ
రాయచూరు రూరల్: కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అందించాలని ఏఐటీయూసీఐ ర్యాలీ చేపట్టింది. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. కార్మికుల నమోదు ప్రక్రియ, రెన్యువల్, ఆరోగ్య భాగ్య, విద్యా, విశ్రాంతి పింఛన్, ఇతర పథకాలను గురించి కార్మికులకు వివరించాలన్నారు. రాష్ట్ర సర్కార్ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అందించేందుకు తోడు వారిని పర్మినెంట్ చేసేలా సర్కార్ చర్యలు చేపట్టి వారికి సౌకర్యాలు సక్రమంగా అందేలా చూడాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.


