● నిందితుడి అరెస్ట్
హుబ్లీ: ఇంటర్‌నెట్ కేబుల్ కట్ చేసి ప్రభుత్వ సేవలకు ఆటంకం కలిగించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి అప్పగించారు. హుబ్లీ ఉణకల్ నివాసి అనిల్ సురేష్‌గిరిని అరెస్ట్ చేశారు. నరగుంద ఆయిల్ మిల్ క్రాస్ దగ్గర టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ ఆఫ్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ కేబుల్‌ను అమర్చారు. ఈ ఇంటర్‌నెట్ టెలికామ్ సేవలకు ఆటంకం కలిగించే దురుద్దేశంతో నిందితుడు అనిల్ తదితరులు గత జూన్ 18న నెట్‌వర్క్ కేబుల్ కట్ చేశారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల సేవలు పూర్తిగా స్తంభించాయి. గత నెల 20న నవలగుంద తాలూకా గొబ్బారగుంపి దగ్గర ఏరియల్– 2 అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా కట్ చేయడంతో 9 గంటల పాటు నెట్‌వర్క్ స్తంభించి రూ.వేలాదిగా నష్టం వాటిల్లింది. కేసును తీవ్రంగా పరిగణించిన నరగుంద సీఐ సత్యప్ప నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
గ్యాస్ సిలిండర్ల డంప్ స్వాధీనం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా హొసహళ్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచిన గోదాముపై అధికారులు దాడి చేసి మొత్తం 216 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్ల మొత్తం విలువ రూ.4,38,306గా అంచనా వేశారు. ఈ కేసులో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు హొసహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
క్రీడలు మనోధైర్యాన్ని
నింపుతాయి
రాయచూరు రూరల్ : క్రీడాకారులు క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తే మనోధైర్యాన్ని నింపుతాయని మాజీ మంత్రి బోసురాజు పిలుపునిచ్చారు. ఆదివారం మహాత్మ గాంధీ ఇండోర్ క్రీడా మైదానంలో రాయచూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి ముగింపు పోటీల్లో క్రీడాకారులకు ట్రోఫీలు అందించి మాట్లాడారు. క్రీడలతో మానసికంగా, శారీరకంగా ఎదగడానికి అవకాశం ఉందన్నారు. క్రీడలతో పాటు విద్యా రంగంపై కూడా ఆసక్తిని కనబరచాలన్నారు.
80 టీఎంసీలకు చేరిన తుంగభద్ర
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల రైతులకు, ప్రజలకు సాగు, తాగు నీరందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు ఊపందుకోవడంతో డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యాంకు ఎగువ నుంచి 43022 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, రిజర్వాయర్‌లో నీటి నిల్వ సోమవారానికి 80 టీఎంసీలకు చేరుకుంది. డ్యాం నుంచి కాలువలకు సాగు నీటి విడుదలపై మంగళవారం మునిరాబాద్‌లో నిర్వహించే ఐసీసీ సమావేశం అనంతరం నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటారు. డ్యాం గరిష్ట నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1625.82 అడుగులకు చేరింది.


