హొసపేటె: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా 1,583 అంగన్‌వాడీ కేంద్రాలు, 1,203 ప్రభుత్వ పాఠశాలలు, 406 ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న మొత్తం 4,44,094 మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ టీ.లింగరాజు తెలిపారు. సోమవారం అమరావతి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. పిల్లల్లో నులిపురుగుల బెడదతో పౌష్టికాహార లోపం, రక్తహీనత ఏర్పడి వారి శారీరక వికాసం, జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతాయన్నారు. అందువల్ల పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు. పిల్లలను నులిపురుగుల బారి నుంచి కాపాడటానికి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. భోజనానికి ముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలన్నారు. పిల్లలు చెప్పులు ధరించి నడవాలన్నారు. 1 నుంచి 19 ఏళ్ల లోపు వారంతా అల్బెండజోల్ మాత్రలను వేసుకుని జిల్లాను నులిపురుగుల రహితంగా మార్చడంలో సహకరించాలన్నారు. జిల్లా ఆర్‌సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్య, అమరావతి ప్రభుత్వ బాలికల పీయూ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీవ్, ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేష్, పీయూ విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగరాజ్ హవల్దార్, జిల్లా కుష్ఠువ్యాధి నిర్మూలన అధికారి డాక్టర్ రాధిక, మహిళా శిశు అభివృద్ధి విభాగం డిప్యూటీ డైరెక్టర్ గంగణ్ణ, విద్యార్థులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
4.44 లక్షల మందికి అల్బెండజోల్ మాత్రల పంపిణీ లక్ష్యం
జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమాధికారి డాక్టర్ లింగరాజు


