రాయచూరు రూరల్: ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేబినెట్‌లో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులుగా నియమించారు. రాయచూరు జిల్లా ఇంచార్జి మంత్రి నియామకంలో అన్యాయం జరిగింది. ప్రస్తుతం జిల్లా ఇంచార్జి మంత్రిగా మంత్రి అజయ్ సింగ్‌ను నియమించడంపై జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో నలుగురు విధాన పరిషత్ సభ్యులు, నలుగురు శాసన సభ్యులున్నా ఏ ఒక్కరూ మంత్రి పదవికి అర్హులు కాదా? అనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. సోమవారం ఎమ్మెల్యే హంపనగౌడ బాదర్లికి మంత్రి పదవి కల్పించాలని జిల్లాలోని సింధనూరులో అభిమానులు రాస్తారోకో చేశారు. నగరంలో బాదర్లి అభిమాని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటున్న సమయంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఎంకు పంపదలచిన వినతిపత్రాన్ని ఏసీ హంపణ్ణకు అందించారు.


