కోలారు: కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధుల అవినీతి కుంభకోణంలో జైలుకు వెళ్లి వచ్చిన నాగేంద్రను మంత్రివర్గంలోకి ఎలా తీసుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ప్రశ్నించారు. ఆదివారం నగర సమీపంలోని రత్న కన్వెన్షన్ హాల్‌లో ఆగ్నేయ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్‌డీఏ అభ్యర్థిగా పోటీ పడుతున్న కె.ఎం.సురేష్ ఎన్నికల ప్రచార పూర్వ సిద్దతా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగేంద్రపై ఇంకా విచారణ జరుగుతున్న నేపథ్యంలో వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. బిడది టౌన్‌షిప్‌ను వ్యతిరేకించిన విపక్ష నాయకుడు ఆర్.అశోక్, కేంద్ర మంత్రి కుమారస్వామి చేస్తున్న పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ఉందన్నారు. రైతులకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ విషయంలో హోం మంత్రి ప్రియాంక ఖర్గే విమర్శలను ఖండిస్తున్నామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పదవుల కోసం ఢిల్లీ చుట్టూ తిరగడం మాని రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఓం శక్తి చలపతి తదితరులు పాల్గొన్నారు.


