అవినీతి రూపుమాపాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

అవినీతి రూపుమాపాలని నిరసన

Aug 9 2026 2:04 AM | Updated on Aug 9 2026 2:04 AM

హొసపేటె: కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(కేపీఎస్సీ)లో అవినీతిని రూపుమాపాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం జాబ్‌ ఆస్పిరెంట్స్‌ స్ట్రగుల్‌ కమిటీ, ఆల్‌ ఇండియా డెమొక్రటిక్‌ యూత్‌ ఆర్గనైజేషన్‌(ఏఐడీవైఓ) జిల్లా శాఖ నేతృత్వంలో నిరసన చేపట్టారు. ఏఐడీవైఓ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రిస్వామి మాట్లాడుతూ యువత కలల వెలుగుగా ఉండాల్సిన కేపీఎస్సీలో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. నిరసనలో పోరాట సమితి జిల్లా కో–ఆర్డినేటర్‌ ప్రకాష్‌ నాయక్‌, ఏఐడీఎస్‌ఓ, జేఏసీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

దుర్గమ్మ ఆలయానికి విరాళం

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్న దానానికి కర్ణాటకకు చెందిన భక్తులు రూ.2.50 లక్షలు విరాళంగా అందజేశారు. రాయచూరు నగరానికి చెందిన కే.వెంకటరావు, పార్వతి దంపతులు శనివారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులకు రూ.2.50 లక్షల విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు.

తాగునీటి సమస్య ఉండబోదు

హొసపేటె: రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విజయనగర జిల్లాలో తాగునీటి సమస్య ఉండబోదని జిల్లా ఇంచార్జి మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లాలోని కూడ్లిగి తాలూకా మొరబ గ్రామంలో కరువు సర్వే నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యాంలో 80 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ప్రస్తుతం డ్యాంలో 70 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉందన్నారు. కరువు కారణంగా రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపు కష్టమవుతుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదిస్తామని ఆయన అన్నారు. శాఖల కేటాయింపుపై వ్యాఖ్యానిస్తూ, తనకు ఏ శాఖ ఇచ్చినా నిర్వహించడానికి తాను సిద్ధమని అన్నారు.

జాతీయ రహదారి పనుల్లో అలసత్వం తగదు

రాయచూరు రూరల్‌: జిల్లాలో జాతీయ రహదారి పనుల్లో అధికారులకు అలసత్వం తగదని రాయచూరు లోక్‌సభ సభ్యుడు జీ.కుమార్‌ నాయక్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తన కార్యాలయంలో జాతీయ రహదారి పనుల ప్రగతిపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్‌ మాల పథకంలో భాగంగా రాయచూరు–హునగుంద మధ్య చేపడుతున్న జాతీయ రహదారి పనుల్లో నాణ్యత కొరవడిందన్నారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రధాన రహదారి నిర్మాణ పనుల్లో లోపాలను సవరించి శాసీ్త్రయంగా రహదారి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. రహదారిరి వెడల్పుగా చేసి మురుగు కాలువలను చిన్నవిగా చేసి వర్షాకాలంలో నీరు పారకుండా నిర్మాణం చేపట్టడంపై పెదవి విరిచారు.

చురుకుగా కాలువ గట్టు మరమ్మతులు

రాయచూరు రూరల్‌: తుంగభద్ర ఎడమ కాలువపై మైలాపూర్‌, దుర్గా క్యాంప్‌ల మధ్య కుదించుకు పోయిన సిమెంట్‌ కాంక్రీట్‌ కాలువ గట్టు మరమ్మతు పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ నెల 11న తుంగభద్ర నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశం ఏర్పాటు చేసి కాలువలకు నీటి విడుదలపై నిర్ణయాలు తీసుకోనున్న నేపథ్యంలో కొప్పళ జిల్లా ఇంచార్జి మంత్రి శివరాజ్‌ తంగడిగి మరమ్మతు పనులను సత్వరం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడంతో యంత్రాల సాయంతో పనులను శరవేగంగా చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement